Aadujeevitham Collections : ‘ఆడు జీవితం’- ద గోట్ లైఫ్ మూవీ మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్న మూవీ. సినిమా రిలీజ్ కు ముందే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ కలెక్షన్లు సాధిస్తోంది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మలయాళం హీరో థ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టింది.
మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో ఆడుజీవితం చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనిపై నటుడు పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘‘ది గోట్ లైఫ్ కొత్త శిఖరాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు’’ అని అన్నాడు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్ర విజయంపై మూవీ టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ‘‘మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనం’’ అని కామెంట్ చేస్తున్నారు.
ఇదీ ఆడుజీవితం స్టోరీ.. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ సినిమా. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ను రచించగా.. దీనిని చిత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ‘ఆడు జీవితం’ను రూపొందించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గడమే గాక.. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటలపాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్ కాఫీ మాత్రమే తాగి నటించారు. అందుకే ఈ చిత్రం రియాలిటీకి చాలా దగ్గరగా అనిపించి ప్రేక్షకుల మనసు గెలిచేసింది.
ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్’ రూ.230 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళీ చిత్రాల జాబితాలో టాప్-1లో నిలిచింది. ఇంకా పలు చోట్ల ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. దీని తర్వాత ‘2018’ (రూ.176 కోట్లు), ‘పులి మురుగన్’ రూ.150 కోట్లు, ప్రేమలు రూ.136 కోట్ల మేరకు వసూళ్లు సాధించాయి.