Nora Fatehi : నటి నోరా ఫతేహి తెలుగు సినిమాల్లోనూ ఐటమ్స్ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 16 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. దీంతో యవ్వనాన్ని పూర్తిగా ఆస్వాదించ లేకపోయినట్లు తెలిపారు.

‘‘కొందరు నటులు అవకాశాలు ఇప్పిస్తామని నాతో చెప్పి దగ్గరవ్వాలని చూస్తుంటారు. నేను అలాంటివాటికి లొంగిపోయే అమ్మాయిని కాదు. పని కోసం ఏదైనా చేసే రకం కాదని వాళ్లకు మొహం మీదే చెబుతాను. ఇలా ముక్కుసూటిగా ఉండడం వల్లే నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది దాన్ని అర్థం చేసుకోగలరు. మరికొందరు మాత్రం కోపం పెంచుకుంటారు.
వాళ్ల సినిమాల్లో నేను ఉన్నానని తెలియగానే.. ‘ఆమె ఎందుకు వచ్చింది. ఆమెను ఇందులోకి ఎందుకు తీసుకుంటున్నారు’ అని గోల చేస్తారు. నాకు అవకాశాలు రావడం వాళ్లకు నచ్చదు. బెదిరిస్తుంటారు. కించపరిచేలా మాట్లాడుతుంటారు. బాలీవుడ్లో ఆ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారు. ఇక 2014లో వచ్చిన బాలీవుడ్ చిత్రం రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు నోరా ఫతేహి. ఆ తర్వాత తెలుగులోనూ ‘టెంపర్’, ‘బాహుబలి’, ‘కిక్2’ తదితర సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లతో అలరించారు.