uday kiran : డైరెక్టర్లు కొన్నిసార్లు ఒకరితో అనుకున్న సినిమాలను రకరకాల కారణాల వల్ల వేరే వారితో చేయాల్సి వస్తుంది. హీరోలు కూడా మొదట చేయాలనుకున్న సినిమాను ఆ తర్వాత వివిధ కారణాలతో చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని సినిమాలకు సంతకం చేసిన తర్వాత మనసు మార్చుకున్న సందర్భాలున్నాయి. ఇంకొన్ని చిత్రాలకైతే ఏకంగా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోలు, దర్శకులు మారిన సంఘటనలున్నాయి.

ఇలాగే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు కోపంలో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల సినిమా ఫ్లాప్‌ను చవిచూడాల్సి వచ్చిందట. ఓ హీరోపై కోపంతో క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు రవిబాబుకు కోపం ఎందుకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన వీటికి ఇలా సమాధానాలు చెప్పారు.
రవిబాబు దర్శకత్వంలో తరుణ్, ఆర్తి అగర్వాల్, జుగల్ హన్సరాజ్ ప్రధాన పాత్రల్లో సోగ్గాడు సినిమా వచ్చింది. అయితే మొదట రవిబాబు ఈ చిత్రాన్ని తరుణ్, ఉదయ్‌కిరణ్‌లతో తీద్దామనుకున్నారట. కథ విన్న తర్వాత తరుణ్, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ ఓకే చెప్పారట కానీ, ఉదయ్ మాత్రం డైలమాలో ఉండిపోయాడట. చివరకు రవిబాబు స్వయంగా చెన్నై వెళ్లి ఉదయ్‌ను అడిగితే ఓకే చెప్పిన ఉదయ్ కిరణ్, తీరా నిర్మాత సురేష్‌బాబును కలిసిన తర్వాత ‘నేను చేయడం లేదు’ అని చెప్పాడట. మొదట ఓకే చెప్పి తర్వాత మనసు మార్చుకోవడంతో రవిబాబుకు కోపం వచ్చిందట.
అందుకే ఉదయ్ కిరణ్ స్థానంలో బాలీవుడ్ నుంచి నుంచి జుగల్ హన్సరాజ్‌ను తీసుకొచ్చి చందు పాత్ర అతనితో చేయించారట. తన కెరీర్‌లో అలా ఈగోకు పోయి, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టపోయానని రవిబాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంఘటన తర్వాత మళ్లీ అలా ఎప్పుడూ చేయలేదని, కష్టమైనా, నష్టమైనా ఉదయ్‌తో చేయాల్సిందని అన్నారు. అయితే ఉదయ్ కిరణ్ నో చెప్పడంతో సినిమా క్లైమాక్సే యాడ్ చేయాల్సి వచ్చిందట. అలా తను మొదట అనుకున్న క్లైమాక్స్ గురించి కూడా రవిబాబు ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అప్పట్లో యూత్‌లో తరుణ్, ఉదయ్‌కిరణ్, ఆర్తి అగర్వాల్‌లకు సూపర్ క్రేజ్ ఉండేది. అందుకే వీళ్ల ముగ్గురితో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేద్దామనుకున్నాను. ఎమోషనల్ సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనుకున్నాను. అందుకు తగ్గట్టుగానే క్లైమాక్స్ ప్లాన్ చేశాను. సోగ్గాడు క్లైమాక్స్‌లో రైల్వేస్టేషన్‌లో ఒక రైలు ఇటు వైపు, మరొక రైలు అటు వైపు వెళ్లడానికి రెడీగా ఉండగా ఒక రైల్లో ఉదయ్ కిరణ్, మరో దాంట్లో తరుణ్ ఉంటారు.
ఆర్తి తరుణ్ దగ్గరకు వచ్చినప్పుడు తరుణ్.. ‘నీ మొదటి ప్రేమ అతడు.. నేను మధ్యలో వచ్చి సాయం మాత్రమే చేశా. అతని దగ్గరకే వెళ్లు’ అని చెబుతాడు. దాంతో ఆర్తి ఉదయ్ వద్దకు వెళ్తుంది. అప్పుడు ఉదయ్ కిరణ్ ‘నేను నీ జీవితంలో మొదటి ప్రేమికుడినే కావచ్చు. కానీ, అతను చేసినంత సాయం, సాహసం నేను చేయలేను. నాకంటే అతడే బాగా చూసుకుంటాడు’ అని చెబుతాడు.
ఇద్దరూ అలా అనడంతో రెండు ట్రాక్‌ల మధ్య కూర్చొని ఆర్తి ఏడుస్తుండగా ఆమె కళ్లెదుట ఒక గులాబీ కనిపిస్తుంది. అది తరుణ్ తీసుకొచ్చింది’’ ఇలా రవిబాబు క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు. ఉదయ్ నో చెప్పడంతో హన్సరాజ్‌ను తీసుకురావడం వల్ల ఆర్తి పాత్ర తరుణ్‌తోనే వెళ్లిపోతుందని ప్రేక్షకుడికి ముందే అర్థమైపోయింది. దీంతో సినిమా చివరివరకూ ఆకట్టుకోలేకపోయిందని రవిబాబు అన్నారు.