‘సూరారై పోట్రు’ తెలుగులో ఆకాశమే నీ హద్దు రా సినిమాతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న Aparna Balamurali కి ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. ఓ కళాశాల ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెతో ఓ స్టూడెంట్ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..?
అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘తన్కమ్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన సహనటుడు వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజ్‌పై కూర్చొని ఉండగా.. ఓ విద్యార్థి అక్కడికి చేరుకుని ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ఆమె చేయి పట్టుకుని లాగి నిల్చొమని బలవంతం చేశాడు. దీంతో చేసిదిలేక ఆమె నిల్చొగానే.. ఆ యువకుడు భుజంపై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్రవర్తనకు కంగుతిన్న ఆమె.. అతడి నుంచి దూరంగా జరిగింది.
ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విద్యార్థి తిరిగి స్టేజ్‌పైకి వచ్చి.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తనని ఎంతగానో బాధించిందని వాపోయారు.
‘అదొక తీవ్రమైన చర్య. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం అర్థం చేసుకోలేరా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళపట్ల ప్రవర్తించాల్సిన తీరు కాదిది’ అని అన్నారు.
ఈ ఘటనపై తానేమీ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని అపర్ణా బాలమురళీ తెలిపారు. ఫిర్యాదు చేసి, దాని వెనుక పరిగెత్తే సమయం తనకు లేదన్నారు. సదరు విద్యార్థి చేసిన చర్యను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమె వివరించారు.
మరోవైపు అపర్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకుడిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. అతడిపై వారం రోజులపాటు సస్పెన్షన్ విధించినట్లు స్థానిక ప్రతికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా ఈ ఘటనపై విద్యార్థి వివరణ కోరింది.
మరోవైపు, కళాశాల యూనియన్.. నటికి క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘లా కళాశాలలోని ఓ కార్యక్రమానికి హాజరైన నటికి ఇలాంటి సంఘటన ఎదురుకావడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే యూనియన్ అధికారి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇబ్బంది కలిగేలా చేసినందుకు మరోసారి క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొంది.