Teja Sajja : జనవరి 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన చిత్రం ‘హనుమాన్’. ఎన్నో కష్టాలను ఎదురుకొని ఈ సినిమా సాధించిన బాక్స్ ఆఫీస్ విజయం ని చూసి చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు కంటెంట్ బలంగా ఉంటే ఇప్పుడు సినిమాకి పెద్ద సినిమాకి తేడా లేదు అనే నమ్మకం ని కలిగిచింది. రెండు వారాల్లో 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం, మూడవ వారం లో 50 కోట్ల రూపాయిల గ్రాస్, 22 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.
ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ, ఈ చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తుంది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని అద్భుతం అనే చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా ఊహకి అందని వసూళ్లను రాబట్టినప్పుడు ఈ సినిమాలో పని చేసిన వాళ్లకు నిర్మాత విడుదల తర్వాత లాభాల్లో ఎంత డబ్బులు ఇచ్చాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.
కేవలం సినీ రంగం లోనే కాదు, ఏ రంగం లో అయినా ఒక సంస్థ ఊహకు మించిన లాభాలను అందుకుంటే ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు ప్రోత్సాహంగా ఎక్కువ డబ్బులు ఇవ్వడం అనేది సర్వసాధారణం. అలా ‘హనుమాన్’ సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ కేవలం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకున్నారు.
కానీ విడుదల తర్వాత ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి హీరోకి మరో 5 కోట్ల రూపాయిలు, అలాగే డైరెక్టర్ కి ఆరు కోట్ల రూపాయిలు అదనంగా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. చాలా మంది మీడియం రేంజ్ హీరోలు కూడా అందుకోని రేంజ్ రెమ్యూనరేషన్ ని తేజ సజ్జ ఈ సినిమాతో అందుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ డిమాండ్ ని తేజా సజ్జ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.