Pallavi Prashanthది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు. తండ్రి సత్తయ్య రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్‌కు చిన్నప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్ అంటే మక్కువ. స్నేహితులతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఫోక్ సాంగ్స్‌తో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో అప్పటి వరకూ సంపాదించిన డబ్బులతో పాటు, ఛానల్‌నూ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెబితే ‘బిడ్డా నువ్వు అలాంటి పని చేస్తే మేమూ బతకం. మళ్లీ నువ్వు చేయాలనుకున్నది చెయ్. నేను నీకు అండగా ఉంటా’ అని చెప్పడంతో ప్రశాంత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం మొదలు పెట్టాడు. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి, సోషల్‌మీడియాలో పంచుకోవడంతో నెమ్మదిగా ప్రశాంత్‌కు అభిమానులు పెరిగారు.
‘అన్నా.. రైతు బిడ్డను..’ ‘అన్నా మళ్లొచ్చినా.. ’ అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగ్‌లు, పలికించే హావభావాల వీడియోలు వైరల్ అవడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ‘బిగ్‌బాస్’ షోపై ఆసక్తి పెరగడంతో ‘ఎప్పటికైనా బిగ్‌బాస్ షోకు వెళ్తా’ అంటూ మరికొన్ని వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే, పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు. అలా గత రెండు సీజన్‌లకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. మరోవైపు ఊరికి వచ్చి, ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే ‘నువ్వు బిగ్‌బాస్ వెళ్లడమా.. అది అయ్యే పని కాదులే’ అంటూ ఎగతాళి చేసేవారట.
అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా వీడియోలు చేసి, ‘ఇవి నాగార్జునగారి వద్దకు వెళ్లే వరకూ షేర్ చేయండి’ అంటూ నెటిజన్లను కోరడంతో అవి కాస్త ట్రెండింగ్ అయ్యాయి. అంతేకాకుండా, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న పలువురి దగ్గరకు వెళ్లి తనని సపోర్ట్ చేయమని కోరిన రోజులూ ఉన్నాయి. ఎట్టకేలకు సీజన్-7 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్రశాంత్‌ను సంప్రదించడంతో తాను అనుకున్న కల నెరవేరిందని తెగ సంబరపడిపోయాడు. తండ్రి వద్ద రూ.500 తీసుకుని హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ బిగ్‌బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి యూట్యూబర్‌గా ‘రైతు బిడ్డ’గా అడుగు పెట్టాడు.