Balakrishna’s Grandson : బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు.
ఈ ఈవెంట్ లో అభిమానులతో పాటు చిత్రబృందం కూడా బాగా సందడి చేసింది. ఇక బాలయ్య బాబు సంగతి చెప్పనక్కర్లేదు. ఓ వైపు రాజసం చూపిస్తూనే.. మరోవైపు చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా సందడి చేశారు. కుర్రాడిలా కొంటెగా కవ్వించారు. స్టేజీ ఎక్కి స్టెప్పులేశారు. అదరగొట్టే డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే..?
నందమూరి బాలకృష్ణ మనవడు, తేజస్విని కుమారుడు ఆర్యవీర్ పవర్ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టాడు. బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలోని ‘భయం నా బయోడేటాలో లేదురా’ అనే డైలాగ్‌ను ఈ చిన్నోడు రీ క్రియేట్ చేశాడు. యాక్షన్ అంటూ తాతయ్య చెప్పగానే.. నాన్‌స్టాప్‌గా డైలాగ్ చెప్పేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రసారం చేయగా.. దీనిని చూసి బాలకృష్ణ మురిసిపోయారు. ఇది మాత్రమే కాకుండా శుక్రవారం సాయంత్రం ఒంగోలులో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి.
తారక్ నటించిన ‘జనతా గ్యారేజీ’లోని ‘దివి నుంచి దిగివచ్చావా’ పాటను ప్లే చేసినప్పుడు.. బాలయ్య దానిని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ‘జై బాలయ్య’ పాటతోపాటు ట్రైలర్‌లోని సన్నివేశాలను సైతం ఆయన తనదైన శైలిలో ఆస్వాదించారు. ‘జై బాలయ్య’కు అయితే ఆయన కూర్చొనే డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింటిలో వైరల్‌గా మారాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని నేనే కాదు ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఆయన సినిమాలతో కళామ తల్లి పండుగ చేసుకుంది. ఈ వేడుకతో ఈ రోజు నుంచే సంక్రాంతి సందడి మొదలైంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి. గోపాల్‌గారనే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం. నటులు, టెక్నిషియన్ల నుంచి ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్ మలినేని. ఈయనే కాదు నా తదుపరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడిది ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదు’’ అని చెప్పుకొచ్చారు.