డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా ‘బేబీ’ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిలో డ్రగ్స్ ఎలా వినియోగించాలో చూపించారని కమిషనర్ అన్నారు. ఆ సీన్స్ ని ప్రత్యేకంగా ప్రదర్శించి మరీ చూపించారు. అలాంటి దృశ్యాలను చూపించినందుకు గానూ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్లు సీపీ తెలిపారు. దీనిపై తాజాగా దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. ‘బేబీ’ సినిమాలో డ్రగ్స్ వినియోగించే సన్నివేశాలు పెట్టడంపై వివరణ కోరుతూ పోలీసులు ఒక నోటీస్ ఇచ్చినట్లు సాయి రాజేష్ తెలిపారు.
చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ తో సహా సీవీ ఆనంద్ ను కలిసిన దర్శకుడు.. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసాడు. ఇందులో సాయి రాజేష్ మాట్లాడుతూ..”సినిమాలో సీత, వైష్ణవిల మధ్య గంజాయి తాగే ఒక సీన్ కి యూట్యూబ్ లో చట్టబద్ధమైన హెచ్చరిక లేదు అనే దానిపై పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు. ఇంత ఇంటెన్స్ గా డ్రగ్స్ ని వినియోగించే విధంగా సినిమాలు తీయొద్దని సీపీ ఆనంద్ సూచించారు.
దానివల్ల యూత్ కి రాంగ్ మెసేజ్ వెళ్తుంది.. ఈ విషయాలను మీరు టాలీవుడ్ లోని డైరెక్టర్స్ రైటర్స్ యాక్టర్స్ కు తెలియజేయాలని ఆయన చెప్పారు” అని తెలిపారు. ”కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్ సీన్ పెట్టాల్సి వచ్చిందని నేను వివరణ ఇచ్చా. రాంగ్ ఫ్రెండ్ షిప్స్ వల్ల ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి లైఫ్ ఎలా పాడైపోయింది.. డ్రగ్స్, ఆల్కహాల్ కు అలవాటు పడటం వల్ల జీవితంలో ఏమేమి కోల్పోయిందనేది ‘బేబీ’ కథ” అని సాయి రాజేష్ చెప్పారు.