Actress Rohini : రోహిణి అంటే అంతగా గుర్తుపట్టరేమో కానీ రౌడీ రోహిణి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ భామ బుల్లితెరను ఏలేస్తోంది. ఓవైపు సీరియల్స్.. మరోవైపు రియాల్టీ షోస్.. ఇంకోవైపు కామెడీ షోస్ చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపోతంది. సీరియల్స్‌తో తన కెరీర్ షురూ చేసిన రోహిణి ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది మాయా అంటూ తనదైన స్లాంగ్‌తో ఈ బ్యూటీ పలికే సంభాషణలు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
నెమ్మదిగా ఈ భామ వెండితెరపైనా అడుగుపెట్టింది. చిన్నచిన్న పాత్రలను దక్కించుకుంటూ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఈ భామ మళ్లీ తెరపై కనిపించేందుకు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ భామ తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది.
ఓ షోలో పాల్గొన్న రోహిణి తన బ్రేకప్ గురించి చెప్పింది. ఇప్పటి వరకు రోహిణి లవ్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెకు లవర్ ఉన్నాడా లేదా అన్నది ఎప్పుడూ చర్చకు రాలేదు. అయితే తాజాగా ఓ షోలో ఈ విషయాన్ని బయటపెట్టింది రోహిణి. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని కానీ కొన్నాళ్ల క్రితం విభేదాల వల్ల విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. దానివల్ల చాలా నరకం అనుభవించానని.. ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లానని తెలిపింది. అయితే ఆ సమయంలో రోహిణికి ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్‌గా ఉన్నారట.
‘నా బాయ్‌ఫ్రెండ్ నాతో పాటు ఇంకో అమ్మాయితో కూడా ప్రేమాయణం నడిపాడు. ఆ విషయం తెలిసి నిలదీసేసరికి అవును నిజమేనని చెప్పాడు. ఇద్దరితో ప్రేమేంట్రా అని గట్టిగా అడిగేసరికి ఏం మాట్లాడలేదు. ఎంతో నమ్మకంతో ప్రేమిస్తే.. చీట్ చేశాడు. అలాంటి వాడితో ఉండటం ఇష్టం లేక బ్రేకప్ చెప్పేశాను. అతడిచ్చిన షాక్‌తో మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది’ అంటూ రోహిణి ఎమోషనల్ అయింది.
‘నా బ్రేకప్ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్‌గా నిలిచారు. ఏమైపోతాననో చాలా బాధపడ్డారు. వాళ్ల బాధను చూడలేకపోయాను. ఆఫ్ట్రాల్ వాడి కోసం నేను ఆలోచించడం ఏంటని అనిపించింది. వాడి కోసం నేను బాధ పడటమే గాక.. నా వాళ్లందర్నీ బాధ పెడుతున్నాననిపించింది. ఆ క్షణం ఇక ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేశాను’. అని రోహిణి చెప్పుకొచ్చింది. అయితే తన లవర్ పేరు మాత్రం రోహిణి రివీల్ చేయలేదు. దీంతో ఈ రౌడీ రోహిణిని అంతలా బాధపెట్టిన వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు తెగ తలలు బద్ధలు కొట్టేసుకుంటున్నారు.