‘ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి’ అంటూ చిట్టి క్యూట్ గా రిక్వెస్ట్ చేసినా.. ‘నా వల్లనే ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండ్రా.. నేనిక్కడికెళ్లి ఎళ్లిపోతా’ అంటూ రాహుల్ నవ్వించినా.. ‘రైస్ పెట్టి కర్రీ తెచ్చుకుందమా.. కర్రీ తెచ్చుకుని రైస్ పెట్టుకుందమా’ అని ప్రియదర్శి అమాయకంగా అడిగినా.. వీళ్లందరి కంటే డబుల్ ఫన్ అందిస్తూ “చాణక్యమ్.. ఇరికించెన్” అంటూ నవీన్ పొలిశెట్టి నవ్వులు పూయించినా.. దీనంతటి వెనక ఉంది ఒకే ఒక్కడు. అతడే డైరెక్టర్ అనుదీప్. ‘జాతిరత్నాలు’ మూవీతో కరోనాతో రెండేళ్లుగా వాడిపోయిన అందరి జీవితాల్లో ఒక్కసారిగా నవ్వులు నింపారు. ఇప్పుడు ‘ప్రిన్స్’ అంటూ కోలీవుడ్ ప్రిన్స్ శివకార్తికేయన్ తో మూవీ చేసి మరోసారి తన టైమింగ్ పవర్ ని చూపించారు అనుదీప్.
‘ప్రిన్స్’ మూవీ విజయం గురించి ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు అనుదీప్. తన సినిమాల్లో కామెడీకి, పంచ్ ల టైమింగ్ కి ప్రశంసలే కాదు.. విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. కొంతమంది అయితే చెత్త కామెడీ అంటూ కామెంట్స్ చేశారని తెలిపారు.
‘‘ప్రశంసలే కాదు.. నాపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కొంతమంది నాది చెత్త కామెడీ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. చార్లీచాప్లిన్‌కు ఉన్నంత తెలివి నాకు లేదు. నాకున్న తెలివి, కామెడీ టైమింగ్‌కు అనుగుణంగా ఎవర్ని బాధపెట్టకుండా కుటుంబం మొత్తం కలిసి నవ్వుకునేలా సినిమాల్లో హాస్యాన్ని పండిస్తున్నా. నా కామెడీ కొంతమందికి నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. నచ్చకపోతే విమర్శించండి. తప్పులేదు. ఎందుకంటే నేను విమర్శలను స్వాగతిస్తా. అయితే, విమర్శలు ఎప్పుడూ వివరణాత్మకంగా ఉండాలి.
నా సినిమాల్లోని ఏ సీన్‌లో మీకు కామెడీ నచ్చలేదో చెబితే మరింత మెరుగుపరుచుకుంటా. ఇక, కొంతమంది అయితే ‘జాతిరత్నాలు’ లక్కీగా హిట్ అయ్యిందన్నారు. అలా, ఎందుకు అంటున్నారో నాక్కూడా చెప్పండి. రెండేళ్ల పాటు మేము కష్టపడి ఆ సినిమా చేశాం. అసలు జనాలు ట్రోలింగ్ ఎందుకు చేస్తారో నాకర్థం కాదు. ఎవరినైనా కావాలని ఎలా బాధ పెడతారో అర్థంకాదు. కొందరి ట్రోలింగ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. అసలు నా మీద ట్రోల్ ఎందుకు చేస్తుండ్రో నాకైతే అర్థమైతలేదు. ’’ అని అనుదీప్ అన్నారు.