ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో రజనీకాంత్ . ఆయన సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా రజనీ సినిమా ముచ్చట్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తే, పాత రజనీకాంత్‌ను గుర్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘జైలర్’కు భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఇటీవల ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీ స్పీచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. వేదికపై ఆయన మాటలు, హావభావాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..’’అంటూ ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ పలికిన మాటలకు అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అలాగే దుర్యోధనుడి పాత్ర గురించి హావభావాలు పలికిస్తూ చెప్పిన డైలాగ్ కూడా చప్పట్లు కొట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీ తమిళంలో మాట్లాడుతున్నా, ఆ మాటలు వింటుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
రజనీకాంత్ సినిమా అంటే వసూళ్లు సునామీ సృష్టించాల్సిందే. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, దాన్ని ఆపటం ఎవరితరం కాదు. రజనీ కెరీర్లో అత్యధికంగా 2.ఓ రూ.800 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఆ తర్వాత రోబో (రూ.290 కోట్లు), కబాలి (రూ.286 కోట్లు), పేట (రూ.230 కోట్లు), దర్బార్ (రూ.200 కోట్లు) వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ‘జైలర్’ ఆ రికార్డులను తిరగ రాస్తుందో లేదో చూడాలి. జైలర్‌లో తమన్నా, జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.