సైమా.. సైమా .. సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది ఆనాటి కాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా మారింది. ఇక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అంటే అది వాళ్ళకి ఒక పెద్ద అచీవ్ మెంట్ లాగా నటీనటులు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తాజగా ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయ్యింది.
ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. తర్వాత 10 కేటగిరిల్లో ‘సీతారామం’కి నామినేషన్స్ దక్కాయి. ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘కార్తికేయ2’, అడవి శేష్ ‘మేజర్’లతో పాటు డీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘సీతారామం’ పోటీ పడుతున్నాయి. దుబాయ్‌లోని డి.డబ్ల్యూ.టి.సిలో సైమా వేడుక జరగనుంది.
ఇక తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రానికి దక్కాయి. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ 9 నామినేషన్స్‌ను దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి ‘కాంతార’, యశ్, ప్రశాంత్ నీల్ మాస్, యాక్షన్ మూవీ ‘కేజీయఫ్2’లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల కు ఏడు నామినేషన్స్ వచ్చాయి.