Alito Saradaga : నా సినీ కెరీర్ లో ఫస్ట్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్తుంటే ఆక్సిడెంట్ అయింది

- Advertisement -

Alito Saradaga : చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు సినిమా తెరపై అరంగేట్రం చేసిన ఆలీ ఆ తర్వాత కమెడియన్​గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం టాలీవుడ్​లో సీనియర్ స్టార్ కమెడియన్​గా కొనసాగుతున్నాడు. కమెడియన్​గానే కాదు హీరోగా కూడా ఆలీ ప్రేక్షకులను అలరించాడు. దాదాపు 1000కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. సినిమాలో సూపర్​ స్టార్ కమెడియన్​గా ఎదిగిన ఆలీ ఆ తర్వాత బుల్లితెరపై ఫోకస్ చేశారు. ప్రతి ఇంట్లోకి తాను వెళ్లాలనుకుని టెలివిజన్​ యాంకర్​గా మారారు. అలా ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా అనే కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

Alito Saradaga
Alito Saradaga

ముఖ్యంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన యాంకర్​గా ప్రేక్షకులను అలరించారు. ఈ షోలో గెస్టులను ఆహ్వానించి వారి సక్సెస్ లైఫ్ వెనక ఉన్న కష్టాల గురించి ఆలీ వాళ్లతోనే చెప్పించేవారు. అలా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు.. ఇలా అన్ని విభాగాల వారు ఈషోకు గెస్టులుగా వచ్చారు. దాదాపు ఆరేళ్ల పాటు ఆలీతో సరదాగా జర్నీ సాగింది. కొవిడ్ సమయంలో కూడా ప్రేక్షకులకు ఎంటర్​టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ ప్రోగ్రామ్ చేశారు. ఇక ఈ షోకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్​లో హల్​చల్ సృష్టిస్తున్నాయి.

ఈ కార్యక్రమం 300లకు పైగా ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ షోకు కొంతకాలం విరామం ఇవ్వబోతున్నారు ఆలీ. దీంతో స్పెషల్‌ ఎపిసోడ్‌కు ఆలీనే అతిథిగా విచ్చేయగా, ప్రముఖ యాంకర్‌ సుమ ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటర్వ్యూలో ఆలీ తనకు వచ్చిన మొదటి అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు జరిగిన ఓ దుర్ఘటన గురించి చెప్పారు. అదేంటంటే..?

- Advertisement -

“నా కెరీర్‌లో మొదటిసారి ‘సీతాకోకచిలుక’ వందరోజులు ఆడిన సందర్భంగా షీల్డ్‌ తీసుకోవడానికి వెళ్లా. రావుగోపాలరావు ఆ కార్యక్రమానికి యాంకర్‌.  ‘మల్లె పందిరి’ సినిమా షూటింగ్‌ ముగించుకుని కారులో వెళ్తుంటే యాక్సిడెంట్‌ అయింది. మా గురువుగారు జిత్‌మోహన్‌, ఆయన కూతురికి, నాకూ దెబ్బలు తగిలాయి. దీంతో ట్రీట్‌మెంట్‌ తీసుకుని రాజమండ్రి వెళ్లిపోయాం. యాక్సిడెంట్‌ గురించి ఇంట్లో చెప్పా. అప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు.

‘నీ లైఫ్‌లో తీసుకుంటున్న మొదటి షీల్డ్‌. అది తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి’ అని నాన్న చెప్పారు. ఆ తర్వాత నన్ను రెడీ చేసి తెల్లవారుజామున సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వరకూ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించారు. అసలు వందరోజుల ఫంక్షన్‌ చెన్నైలో ఎక్కడ జరుగుతుందో కూడా తెలియదు. అదే రైలులో ఓ పెద్దాయన కనిపించి ‘వందరోజుల ఫంక్షన్‌కా’ అన్నారు. ‘అవునండీ’ అని చెప్పా. ‘నేనెవరో తెలుసా’ అని అడిగారు. ‘తెలియదు’అని చెప్పా. ‘నేను జంధ్యాల తండ్రిని’ అన్నారు. వెంటనే నమస్కారం పెట్టా. ఆయనే నన్ను ఫంక్షన్‌కు తీసుకెళ్లారు.

అప్పటికే అక్కడ యాంకరింగ్‌ చేస్తున్న రావుగోపాలరావు నాకు యాక్సిడెంట్‌ జరిగిందని తెలుసుకొని.. వేరే వాళ్లని పిలిచి షీల్డ్‌ ఇద్దామనుకున్నారు. ఇంతలో నేను అక్కడ ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది నా జీవితంలో తీసుకున్న తొలి షీల్డ్‌. ఆ తర్వాత ఐదారొందల షీల్డ్స్‌ తీసుకున్నా. కొన్ని మా బంధువులు తీసుకెళ్లారు. ఏడాది పాటు ఆడిన సినిమాల గురించి విన్నా. కానీ, నేను నటించిన ఒక సినిమా ఏడాది పాటు ఆడుతుందని జీవితంలో అనుకోలేదు. అదే ‘యమలీల’. నిజంగా ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగార్లకు ధన్యవాదాలు.” అని ఆలీ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here