Nayanthara : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ Nayanthara దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. పెళ్లైన తర్వాత మొదటి సారి ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత స్టార్డమ్ ఉన్నా.. ఈ లేడీ సూపర్‌స్టార్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. సినిమాలో నటించడం వరకే తన పని అన్నట్లుగా ఉంటుంది. దాని తర్వాత తన పర్సనల్ లైఫ్‌లో తను బిజీ అయిపోతుంది.
తన తదుపరి చిత్రం ‘కనెక్ట్’ ప్రమోషన్స్‌లో భాగంగా నయన్‌తో సుమ స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సినిమా విశేషాలు, టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాలతో పాటు పెళ్లి తర్వాత తన లైఫ్ గురించి షేర్ చేసుకుంది. మరి ఈ బ్యూటీ ఈ ఇంటర్వ్యలో ఇంకా ఏమేం చెప్పిందో తెలుసా..?
ప్రీ రిలీజ్లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?
నయనతార: నీతో ఇంటర్వ్యూలో పాల్గొనాలనుకున్నా. కానీ, నువ్వు ఫుల్ బిజీగా ఉంటున్నావు కదా. అందుకే నేను కూడా వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు రాలేదు.
మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వస్తే ఎవరు ముందు సైలెంట్ అయిపోతారు?
నయనతార: అలాంటిది ఏదైనా జరిగితే.. నేను సైలెంట్‌గా గుడ్‌నైట్ చెప్పేసి వెళ్లి పడుకుని పోతాను.
మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాయా?
నయనతార: నేను ఉన్న ఫీల్డ్ అలాంటిది. అందరూ నా లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కొంతవరకూ అవి బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మరీ ఎక్కువగా నా జీవితంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటివి నన్ను కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి.
పెళ్లి అయ్యాక.. ఓ మహిళ వర్క్ లైఫ్‌లో మార్పులు వస్తాయని భావిస్తున్నారా?
నయనతార: పెళ్లి అయ్యాక అబ్బాయి ఏమీ మారడని.. అమ్మాయి జీవితం చాలా మారుతుందని అంటుంటారు. నేను దాన్ని నమ్మను. ఉదాహరణకు విఘ్నేశ్ నాకు సుమారు 9 ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అదొక్కటే మా మధ్య మారింది. పెళ్లి అయ్యాక వర్క్‌లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాలేదు. తన సపోర్ట్ వల్ల పెళ్లి తర్వాతే నేను ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఓకే చేశా.
దర్శకుడు విఘ్నేశ్ శివన్, నిర్మాత విఘ్నేశ్ శివన్.. ఏమైనా మార్పులు చూశారా?
నయనతార: విఘ్నేశ్ దర్శకుడిగా ఒకలా ఉంటాడు. ఆయనకు కావాల్సిన సీన్స్, షాట్స్‌పైనే దృష్టి పెట్టేవాడు. ఇక, నిర్మాతగా ఆయన పూర్తి భిన్నంగా వ్యవహరిస్తాడు. ఒకరోజు ఎప్పుడైనా షూట్ కాస్త ముందుగానే పూర్తైతే.. వెళ్లిపోవాలనుకున్నప్పుడు.. మరో సీన్ చేయవచ్చు కదా. ఎందుకు వెళ్లిపోవడం అంటాడు.
లాక్డౌన్లో మీ లైఫ్ ఎలా సాగింది?
నయనతార: ప్రశాంతంగా నిద్రపోయాను. ఎన్నో ఏళ్ల నుంచి షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాను. విఘ్నేశ్ బర్త్‌డే, లేదా నా బర్త్‌డే సమయంలోనే బ్రేక్ తీసుకుని విహారయాత్రకు వెళ్లేదాన్ని. మధ్యలో ఎప్పుడూ బ్రేక్స్ తీసుకోలేదు. ప్రతిరోజూ వర్క్‌లోనే ఉండేదాన్ని. అందువల్ల లాక్డౌన్లో ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేశాను.
ఏమైనా షోలు, ప్రోగ్రామ్స్ చూస్తారా?
నయనతార: సాధారణంగా నేను షోలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తా. అయితే లాక్డౌన్ మరీ ఎక్కువగా చూశా. దాని వల్ల కాస్త బోర్ కొట్టింది. అందుకే బ్రేక్ తీసుకున్నా.