Best Characters in 2022 : కొందరు నటులకు 100 సినిమాలు చేసినా అన్ని సాధారణ పాత్రలే ఉంటాయి.. మరికొందరికి చేసింది ఒక్క సినిమానే అయినా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంటుంది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొన్ని పాత్రలు ( Best Characters in 2022 ) ప్రేక్షకుల గుండెల్లో తిష్టవేసి కూర్చుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పాత్రలు కాస్త డిఫరెంట్ గా రియల్ లైఫ్ కి కనెక్ట్ అయినా.. హృదయాన్ని తాకినా.. వాటిని మరిచిపోవడం కష్టం.
అలా ఈ ఏడాది 2022లో కొందరు కథానాయికలు తమ సినిమా కెరీర్ లోనే ది బెస్ట్ పాత్రలు దక్కించుకున్నారు. ఆడియెన్స్ హార్ట్ లో తమ స్టాంప్ వేసేశారు. అలా ఈ ఏడాదిలో ప్రేక్షకులను బాగా అలరించిన.. ఆకట్టుకున్న కథానాయిక పాత్రలు.. వాటిని పోషించిన హీరోయిన్ల గురించి ఓసారి లుక్కేద్దామా..?
సీతామాలక్ష్మీ.. ‘సీతారామం’ సినిమాలో.. లెఫ్టినెంట్ అధికారి అయిన రామ్ (దుల్కర్ సల్మాన్)కు ఉత్తరాలు రాస్తూ ప్రేమను పండించిన సీతామాలక్ష్మీ పాత్రలో ఒదిగిపోయింది మృణాళ్. తొలి ప్రయత్నంలోనే తెలుగు తెరకు పరిచయమైన మృణాళ్ తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. 100 ఏళ్ల అయినా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను.. సీతామాలక్ష్మీని.. ఆ పాత్ర పోషించిన మృణాళ్ ను మరిచిపోవడం కష్టమే.
రాధికను మర్చిపోవడం కష్టమే.. ఈ ఏడాది ఎక్కువగా వినిపించిన పేరు రాధిక. ప్రతి సినిమా ప్రేక్షకుడు.. యువతీయువకుల నోళ్లలో ఎక్కువగా నానిన పేరు రాధికనే. డీజే టిల్లు సినిమాలో నేహాశెట్టి పోషించిన పాత్ర అది. సింగర్ అయిన రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కోవడం.. దాన్నుంచి ఆమెను బయటపడేసేందుకు హీరో ప్రయత్నించడం.. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు రావడం.. దాంతో హీరో క్యారెక్టర్ ఫ్రస్టేషన్‌కు గురై, రాధికపై ఉన్న కోపాన్ని తీర్చుకునే తీరు ప్రేక్షకులను మెప్పించింది.
ఓ సన్నివేశంలో ‘రాధిక అక్క’ అంటూ కథానాయకుడు పిలవడం నవ్వులు పంచింది. స్వతహాగా తన ప్రదర్శన కంటే హీరో టీజ్ చేయడం వల్లే హీరోయిన్ క్యారెక్టర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇది నిజంగా నువ్వు నన్ను అడుగుతున్నవా రాధికా అంటూ టిల్లు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది.
కళావతి లేకుంటే.. మహానటితో తనలోని సూపర్ నటిని ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి సురేశ్.. ఆ తర్వాత అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఈ ఏడాది వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి చాలా కొత్తగా కనిపించింది. కళావతి పాత్రలో.. ఆకతాయి అమ్మాయిగా కీర్తి చేసిన అల్లరి కట్టిపడేస్తుంది. ఆమె మాయలో పడిన హీరో ‘కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి’ అని పాటను ఆలపించడంతో ఆ పేరు మారుమోగింది.
సర్పంచి నాగలక్ష్మి.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటించిన సినిమా ‘బంగార్రాజు’ . 2022 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో ఆమె సర్పంచి నాగలక్ష్మి అనే పాత్రలో నటించింది. చాలా సరదాగా ఉండే క్యారెక్టర్ అది. పల్లెటూరి అమ్మాయిగా కృతి ఆహార్యం, హావభావాలు అందరినీ ఆకర్షించాయి. ఈ చిత్రంలోని నాగ చైతన్య, కృతిల హంగామా అంతా ఇంతా కాదు. చాలామంది బావామరదళ్లకు ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది.
నీలాంబరి.. ‘నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి’.. అని ఎందరితోనో పాట పాడించిన నాయిక పూజాహెగ్డే. ‘ఆచార్య’ సినిమాలోని ఆమె పాత్ర పేరుతో సాగే పాట ఇది. ఈ మెలొడీ నీలాంబరి పాత్రకు బలాన్ని తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా పేరు ఆకట్టుకుంది. చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమిది.
ప్రేమ కోసం వెన్నెల పోరాటం.. నక్సలిజం నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ఇందులో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటించగా ఆయన్ను ప్రేమించిన యువతి వెన్నెలగా సాయి పల్లవి జీవించింది. మనసుపడిన వాడితో కలిసి చావడానికైనా సిద్ధమే అనే తెగింపు ఉన్న ఆ పాత్రకు సాయి పల్లవి తప్ప మరెవరూ సరిపోరు అని అనిపించుకునింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.