One Year of Pushpa : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన Pushpa డైలాగ్ కేవలం టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ దాటి బాలీవుడ్‌ను చేరి పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు.
పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. బన్నీ కథానాయకుడిగా రష్మిక మందన్న హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ విడుదలై ఏడాది పూర్తయింది.
పుష్పరాజ్‌గా బన్ని నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇలా ఒక్కటేంటి భారత సినీ ప్రేక్షకులను ఒక మాస్ అవతార్ ఆవహించింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి పాట, ప్రతి డైలాగ్పై మీమ్స్, రీల్స్, రైమ్స్, చిప్స్, చిన్నా, పెద్దా అంతా ‘తగ్గేదేలే’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడమే కాదు, ఊహించని రీతిలో రికార్డులను ‘పుష్పరాజ్’ కైవసం చేసుకున్నాడు. మరి ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది గడిచిన సందర్భంగా ఈ ఏడాదిలో పుష్ప క్రియేట్ చేసిన రికార్డుల పంట ఏంటో చూసేద్దామా..
‘ఆర్య’తో బన్ని కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మైలురాయిని వేశారు సుకుమార్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ పర్వాలేదనిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్, సుకుమార్ చేతులు కలిపారు. ‘పుష్ప’ కథను తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట సుకుమార్. ఆయనకు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అంతకుముందే ఒప్పుకొన్న ప్రాజెక్టుల కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనా స్టోరీ లైన్ వేరని సుకుమార్ ఆ తర్వాత తెలిపారు.
అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ కలిస్తే, సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. ‘పుష్ప’ విషయంలోనూ అదే మేజిక్ రిపీట్ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు, 6 బిలియన్ + వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి.
డిసెంబరు 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధికమంది వీక్షించిన, లైక్ చేసిన వీడియో ‘పుష్ప’టీజర్ నిలిచింది.
ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది. 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అవార్డుల విషయంలోనూ పుష్పరాజ్ ‘తగ్గేదేలే’అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్‌ఫేర్‌లు, మరో ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్ అయ్యాయి.
‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్ రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైన ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన ‘పుష్ప’ ఎర్రచందనం సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తిగా ఎలా ఎదిగాడో పార్ట్-1లో చూపించారు. సీక్వెల్‌లో శత్రువులైన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, జాలిరెడ్డి, మంగళం శ్రీను, దాక్షాయినిల నుంచి పుష్పరాజ్‌కు ఎదురైనా ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అన్నది చూపించబోతున్నారు. అంతేకాదు, ఇందులో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు.