వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈసారి ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ‘వ్యూహం’ అనే సినిమా తీస్తున్నట్టుగా గత కొంతకాలం క్రితమే అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ మొత్తం అధికారిక వైసీపీ పార్టీ కి అనుకూలంగానే అనిపించింది.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది కూడా వైసీపీ పార్టీ కి సంబంధించిన వాళ్ళే అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇటీవల కాలం లో జగన్ ని రెండు మూడు సార్లు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చర్చలు జరిపాడు. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ప్రారంభం నుండే జగన్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. ముందుగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయిన దగ్గర నుండి ఈ టీజర్ ప్రారంభం అవుతుంది.
జగన్ వ్యాయామం చేస్తున్న సమయం లో ఈ వార్తని తెలుసుకొని బాధపడుతాడు, ఆ తర్వాత తండ్రి చనిపోయాక ‘ఓదార్పు యాత్ర’ చెయ్యడం, కాంగ్రెస్ హై కమాండ్ దానిని ఆపేందుకు కావాలని జగన్ పై కేసులు వేయించి ఆయనని జైలుకు పంపడం. ఆ సమయం లో వై ఎస్ భారతి తో జగన్ పంచుకున్న కష్టాలు, మరియు చంద్ర బాబు నాయుడు కుట్ర పూరిత రాజకీయాలు, ఇలాంటివన్నీ ఈ టీజర్ లో చూపించారు.
అయితే టీజర్ లో ఎక్కడా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కనిపించకపోవడం విశేషం. ఇది ఇలా ఉండగా ఎవరైనా డైరెక్టర్ వివాదాస్పద బియోపిక్స్ చేస్తున్నప్పుడు ఆ పాత్రకి సంబంధించిన సొంత పేరుని పెట్టరు. కానీ ఈ చిత్రం లో మాత్రం రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ అటాక్ చేసాడు. టీజర్ చివర్లో ‘అలా చెయ్యడానికి నేనేమి చంద్ర బాబు ని కాదు’ అంటూ జగన్ పాత్రధారి చెప్పడం, ఆశ్చర్యానికి గురి చేసింది. దీని పై తెలుగుదేశం కార్యకర్తలు భవిష్యత్తులో చాలా పెద్ద గొడవలు చేసే అవకాశం ఉంది.