వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు షురూ అయ్యాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు (జూన్ 20) తెల్లవారు జామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీలోకి వారసురాలు రావడంపై టాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. తమ కుటుంబంలోకి వారసురాలు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరంగా మాట్లాడారు. నేటి తెల్లవారు జామున 1:49 గంటలకు శుభగడియల్లో పాప జన్మించిందని చెప్పిన చిరు.. పాత్రికేయులు అడిగిన చాలా విషయాలకు సమాధానాలు చెప్పారు. హాస్పటల్‌లో పాపను చూసి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు చిరంజీవి.
మనవరాలిని చూసిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మీడియాతో ముచ్చటించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో తమ ఫ్యామిలీలో సంబరాలు షురూ అయ్యాయని, ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం అని చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావాలని, మా చేతుల్లో బిడ్డను పెట్టాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నాం. అయితే ఇన్నేళ్ల తరవాత ఆ భగవంతుడి దయతో, అందరి అశీస్సులతో మా కోరిక నెరవేరిందని మెగాస్టార్ అన్నారు.
పాప ఎవరిలా ఉంది? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా చిరంజీవి స్పందిస్తూ.. ఇంకా చెప్పలేమని అన్నారు. పాపను చూశాను కానీ పోలికలు అప్పుడే చెప్పలేనని నవ్వుతూ బదులిచ్చారు. తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు మంగళవారం నాడు పాప పుట్టడం శుభపరిణామమని ఆయన తెలిపారు. అంతకుముందు లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. నీ రాకతో మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు. తల్లి దండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన.. తాతగా తనకు చాలా గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.