రాజకీయాలకు, సినిమాలకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. సినిమా తారలు చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ ఇప్పటికే రాచుకుంది. పార్టీలన్నీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ కమెడియన్ ఒకరు పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయం రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ఏపీలో మరోసారి ఎన్నికల హీట్ పెరిగింది.
యాక్షన్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా హారర్ జోనర్ అయినా ఏ జోనర్ అయినా సప్తగిరి ఎంటర్ అయితే.. ఎంటర్టైన్మెంట్ ఎక్స్ ప్రెస్‌లా పరుగు పెడుతుంది. ప్రేమ కథా చిత్రంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. తాజాగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తన పొలిటికల్ ఎంట్రీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ ఉన్నట్లు చెప్పారు. టీడీపీ నుంచే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి తన మద్దతును ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్ లేదంటే అసెంబ్లీకి పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్‌ను కూడా కలిశానన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమన్నారు సప్తగిరి. పేదలకు సర్వీస్ చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులకోనని చెప్పారు. తాను పోటీ చేయాలా వద్దా అనే విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలుసన్నారు.
కాగా, చిత్తూరు జిల్లా నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చి ప్రస్తతం మంత్రిగా వైసీపీ సర్కారులో పని చేస్తున్నారు రోజా. దివంగత శివప్రసాద్ కూడా సినిమాల్లో నటిస్తూనే.. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి.. ప్రజలకు సేవ చేశారు. మరి అదే జిల్లా నుంచి వస్తున్న సప్తగిరి ఏ మేర తన మార్క్ చూపిస్తారో చూడాలి.