Kushi Kapoor : సీనియర్ నటి శ్రీదేవి నేడు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె తన సినిమాల వారసత్వాన్ని మిగిల్చింది. నేటికీ ఆమె సినిమాలంటే చాలామందికి అమితమైన ఇష్టం. 24 ఫిబ్రవరి 2018న ఆమె దురదృష్టకర మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి ఉత్తమ చిత్రాలలో ఒకటైన ఇంగ్లీష్ వింగ్లీష్ చాలా మందికి నచ్చింది. ఆమె భారతదేశ చిత్రసీమలో అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఒకానొక సమయంలో ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంపై తన కుమార్తెల స్పందనను మీడియాతో పంచుకున్నారు.

2012లో విడుదలైన ఇంగ్లీష్ వింగ్లీష్ కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా శ్రీదేవి తన కుమార్తెలు దీనిపై ఎలా స్పందించారో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా చూసి చిన్న కూతురు ఖుషి చాలా బాధపడ్డానని తనతో చెప్పినట్లు శ్రీదేశి తెలిపింది. సినిమాలో తన కూతురిగా నటించిన అమ్మాయి ప్రవర్తన ఖుషీకి అస్సలు నచ్చలేదట. శ్రీదేవి మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన నా ఇద్దరు కూతుళ్లు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా నా చిన్న కుమార్తె అమ్మా, నేను చాలా బాధపడ్డాను, నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు. ఆమె నా తల్లికి ఇలా ఎలా చేయగలదు? అంటూ వాపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ వారి శ్రీదేవితో చాలా సన్నిహితంగా ఉండేవారు.

ఈ సినిమా కథ గురించి చెబుతూ.. ఇంగ్లీషులో ఇబ్బంది పడే తల్లిగా శ్రీదేవి నటించింది. ఇంగ్లీష్ రాకపోవడంతో ఆమె పిల్లలు, భర్త తనను ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు అనేక సమస్యలు కూడా వస్తాయి. కానీ ఆమె అన్ని సవాళ్లను అధిగమించి తన కుటుంబం గర్వపడేలా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. తనలాగే శ్రీదేవి కూడా తన కూతురు సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారగా ఎదగాలని కోరుకుంది. కానీ ఆమె తన కల నెరవేరక ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.