Vijay Sethupathi : బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన విజయ్ సేతుపతి.. మెల్లగా హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. తన నటనకు ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు మెల్లగా తనకు విలన్స్ రోల్స్ కూడా ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్నాళ్ల వరకు ఇక విలన్‌గా చేయను అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు సేతుపతి. అంతే కాకుండా దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా బయటపెట్టాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. ఏ పాత్ర ఇచ్చినా విజయ్ సేతుపతి.. తన నటనతో మిగతా యాక్టర్లను డామినేట్ చేస్తాడు.

అయితే విలన్ పాత్రలు చేయడంలో తనకు అదే చిక్కులు తెచ్చిపెడుతోందని ఈ నటుడు బయటపెట్టాడు. ఇటీవల గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. తాను ఇకపై విలన్ రోల్స్ చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. విలన్ పాత్రలు చేయడం వల్ల తనకు ఒత్తిడి ఎక్కువవుతుందని అన్నాడు. హీరోనే స్వయంగా తనను అడగడం వల్ల విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని బయటపెట్టాడు. కానీ ఆ హీరో ఎవరు అని మాత్రం చెప్పలేదు.

‘‘వారంతా నాపై ఒక విధమైన మానసిక ఒత్తిడిని తీసుకొస్తున్నారు. అది ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. నేను విలన్ పాత్రలు పోషిస్తున్నప్పుడు నాకేమీ చెడుగా అనిపించలేడం లేదు కానీ అదే సమయంలో నాకంటూ చాలా పరిమితులు ఉంటున్నాయి. హీరోకు మించి చేయకూడదు అంటూ నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు. పైగా కొన్ని ఎడిటింగ్‌లో కూడా పోతున్నాయి’’ అని విజయ్ సేతుపతి ముక్కుసూటిగా నిజాన్ని బయటపెట్టాడు. ‘‘ అలాంటి పాత్రలు చేయాలా వద్దా అని నాలో నాకు అయోమయం, ఆందోళన మొదలయ్యింది. అందుకే కనీసం కొన్నేళ్ల వరకు విలన్‌లాగా చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను విలన్‌లాగా చేయను అనగానే కనీసం స్క్రిప్ట్ అయినా వినమని అంటున్నారు. అక్కడే సమస్య మొదలవుతుంది’’ అని తన నిర్ణయాన్ని చెప్పేశాడు.