Vijay Deverakonda , సమంత ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ నిర్వహించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక అంశాలు పంచుకున్నారు. ‘‘కథానాయకుడిగా ఈ ప్రయాణంలో ఒకొక్క సినిమా ఒకొక్క రకమైన అనుభూతిని మిగిల్చింది. ‘ఎవడే సుబ్రమణ్యం?’ సినిమా నేను చేసిన తొలి పెద్ద చిత్రం. ఆ సినిమాను చూడటానికని స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లినప్పుడు తెరపైన నా సన్నివేశాల్ని చూస్తూ ప్రేక్షకులు సందడి చేయడం కనిపించింది.
నన్ను చూసే ఇలా అరుస్తున్నారా అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చారు. ‘పెళ్లిచూపులు’ విడుదల సమయంలో నేను సిటీలో లేను. నా నిర్మాతలు ఫోన్ చేసి నవ్వులతో థియేటర్ ఊగిపోతోందని చెప్పారు. ‘అర్జున్‌రెడ్డి’ విడుదలైన రోజు నా ఫోన్ మోగుతూనే ఉంది. అందులో సందేశాలు చదువుతున్నప్పుడు కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రేక్షకులు నాకు ఇచ్చిన గొప్ప జ్ఞాపకాలు. జయాపజయాల కంటే కూడా మనతో ఎప్పటికీ నిలిచిపోయేది ఈ ప్రేమే కదా అనిపించింది’’.
‘‘సినిమాతోపాటు నాకు ప్రయాణాలన్నా, క్రీడలన్నా చాలా ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లా. చాలా ఆస్వాదించా. ‘ఖుషి’ కోసం కశ్మీర్లో గడిపిన రోజులు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్నేహితులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడుతుంటా. మంచి ఆహారం అన్నా నాకు చాలా ఇష్టం. నా కుటుంబ సభ్యులు, నా బృందంతో వ్యాపారం గురించి చర్చిస్తూ ఉంటాను. ఆర్కిటెక్చర్‌పై కూడా ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తులో ఒక మంచి వ్యవసాయ క్షేత్రం కొని నాకు నచ్చినట్టుగా నేను తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన ఉంది’’.ఇప్పుడీ మాటలు నెట్టింట వైరలవ్వడంతో ఇటీవల రష్మికతో కలిసే కదా వెళ్లింది.. అక్కడ ఇద్దరూ ఎంజాయ్ చేశారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.