హీరో విజయ్ దేవరకొండ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని.. వంద కుటుంబాల ఆనందానికి కారణమయ్యారు. తాజాగా ‘ఖుషి’ సక్సెస్ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం ఎంపిక చేసిన వంద కుటుంబాలకు రూ.లక్ష రూపాయల చెక్‌ను ఆయన అందించారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్న విజయ్.. ఎంతో ఆనందంగా ఉందన్నారు.
‘నాకు ఇప్పుడు నిజమైన సంతోషం, సంతృప్తి లభించాయని భావిస్తున్నా. మీరంతా కూడా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఆరోగ్యంగా, పనిచేస్తున్నంతకాలం ప్రతి ఏడాది ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటా. ఇవన్నీ నా వ్యక్తిగత కోరికలు. చిన్నప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను కొన్ని ఆనందాలకు దూరమయ్యాను. అందుకే ఇప్పుడు నా సంపాదనలో ఇలా సాయం చేస్తున్నా. మా తమ్ముడి ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు.
ఎవరైనా రూ.లక్ష ఇస్తే బాగుండని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు నేనిచ్చిన ఈ రూ.లక్ష రూపాయలు మీకు ఏదోరకంగా ఉపయోగపడి మీ అవసరాలు తీరితే అదే చాలు. మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని విజయ్ దేవరకొండ అన్నారు. డబ్బులు అందుకున్న వారు ఎవరూ తనకు థ్యాంక్స్ చెప్పొద్దని విజయ్ కోరారు. ప్రేక్షకుల అభిమానం చాలని ఆయన అన్నారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసిస్తున్నారు.