‘ఖుషి’ సినిమా సంపాదనలోంచి రూ. కోటిని అభిమానులకు ఇస్తానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రకటించడం టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌ది గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్, పలువురు నెటిజన్స్ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, అందుకు తమకూ సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయోత్సవాల్లో భాగంగా ‘ఖుషి’ చిత్ర బృందం విశాఖపట్నంలో సోమవారం సాయంత్రం ఓ వేడుక నిర్వహించింది.
ఆ వేదికపై విజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరితో కలిసి ‘ఖుషి’ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఈ సినిమా విషయంలో నేను సంపాదించిన దాంట్లోంచి రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నా. వారిని కలుసుకుని ఒక్కో ఫ్యామిలీకి రూ. లక్ష అందించినప్పుడే నాకు తృప్తి’’ అని కాస్త భావోద్వేగంతో మాట్లాడారు. ఆర్థిక అవసరం ఉన్న వారు వివరాలు నమోదు చేసుకోవాల్సిన సంబంధిత గూగుల్ ఫామ్స్‌ని విజయ్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. అయితే, దీనిపై అభిషేక్ పిక్చర్స్ సంస్థ తాజాగా ట్వీట్ చేసింది.
‘‘డియర్ విజయ్ దేవరకొండ! వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ, దానిపై ఎవరూ స్పందించలేదు. మీరు దయా హృదయంతో రూ. కోటిని పలు కుటుంబాలకు అందివ్వనున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొంది. విజయ్ హీరోగా 2020లో వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను అభిషేక్ పిక్చర్స్ ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ‘కేశవ’, ‘సాక్ష్యం’, ‘గూఢచారి’, ‘రావణాసుర’ తదిరత చిత్రాలు ఈ సంస్థలో రూపొందినవే. ఖుషి విషయానికొస్తే.. విజయ్, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. సెప్టెంబరు 1న విడుదలైందీ సినిమా.