Varun Tej : విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవల ఎక్కువగా ఉంది. లేదంటే జైపూర్ లాంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. నటుడు వరుణ్ తేజ్ , నటి లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాలను మాత్రం పెద్దగా బయటకు రానివ్వలేదు. ఇక కొన్ని రోజుల్లో ఈ జంట నిశ్చితార్థం చేసుకోబోతుందనే సమయంలో వార్తలు బయటకు వచ్చాయి.

కొంతమంది ఈ విషయాన్ని నమ్మితే, మరికొంతమంది కొట్టిపారేశారు. కానీ నిశ్చితార్థం చేసుకునేసరికి చాలాంది షాక్ అయ్యారు. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పుడే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు కుంటుంబంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే నెలలో పెళ్లి వైభవంగా జరగనున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా అంటే ఆగస్ట్ 24న వరుణ్, లావణ్య పెళ్లి జరగనుందట.

ఈ డేట్ చాలా ప్రత్యేకమైందట. దీనికి కారణం చిరంజీవి పుట్టినరోజుకు కాస్త అటు ఇటుగా ఉండడమేనని అందుకే ఈ తేదీని ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో పెళ్లి అంటే ఇండస్ట్రీ నుండి చాలా మంది సెలబ్రెటీలు హాజరు కావాల్సి ఉంటుంది. పైగా.. లావణ్య తరపున కూడా సెలబ్రెటీలు, స్టార్స్ చాలా మంది ఉంటారు. ఇంత స్టార్స్ ను ఇండియాలో అయితే ఒకే వేదికపైన చేర్చి, ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం అసాధ్యం. కాబట్టే.. లావణ్య-వరుణ్ వివాహం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారుట.