Vaishnavi To Ramya krishna : ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సినిమాలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది బేబీ మూవీ. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి యువత నీరాజనం పడుతోంది. యూట్యూబర్‌గా పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే పర్ఫామెన్స్ ఇరగదీసి ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకుంటోంది ఈ పాతబస్తీ పిల్ల. ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ మూవీ మేనియానే. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్.. ఇలా ఎక్కడ చూసినా బేబీ వీడియోలు, రీల్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో బేబీ మూవీపై, హీరోయిన్ వైష్ణవిపై వస్తున్న మీమ్స్‌కు లెక్కేలేదు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ బేబీ.. ఇద్దరు హీరోలతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపిస్తుంది. చివరకు ఇద్దరిని మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. కథాపరంగా చూస్తే ఈ చిత్రంలో హీరోయిన్నే ప్రేక్షకులు నెగిటివ్ క్యారెక్టర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇలా హీరోయిన్లు నెగిటివ్ పాత్రల్లో నటించి హీరోలకు హ్యాండ్ ఇవ్వడం తెలుగు తెరకు కొత్తేం కాదు. హీరోయిన్లు.. హీరోలను మోసం చేసే క్యారెక్టర్లు చేయడం టాలీవుడ్లో ఇంతకు ముందు కూడా ఉంది. కానీ ఇలా కథానాయికలు నెగిటివ్ రోల్లో కనిపించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
నాటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ‘ఇంగ్లీష్ పెళ్లాం.. ఈస్ట్ గోదావరి మొగుడు’ సినిమా నుంచి.. రీసెంట్గా థియేటర్లలో సందడి చేస్తూ ప్రేక్షకుల చేత జై కొట్టించుకుంటున్న ‘బేబీ’ వరకూ అనేక మంది హీరోయిన్లు నెగిటివ్ షేడ్స్‌లో ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ ఇద్దరే కాకుండా ఇప్పటి వరకు టాలీవుడ్లో హీరోలను చీట్ చేసి.. ప్రేక్షకులతో వాహ్వా అనిపించుకున్న హీరోయిన్లు.. వారు పోషించిన పాత్రలు.. నటించిన సినిమాల గురించి ఓసారి తెలుసుకుందామా..?

రీసెంట్గా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా బేబీలో వైష్ణవి చైతన్య ‘వైష్ణవి’గా నెగిటివ్ పాత్రలో అలరించింది.
టాలీవుడ్ సీనియర్ నటి, శివగామి.. రమ్యకృష్ణ .. ‘ఇంగ్లీష్ పెళ్లాం.. ఈస్ట్ గోదావరి మొగుడు’ అనే సినిమాలో శిరీష పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఎండ్‌లో పాజిటివ్‌గా మారిపోయి అప్పటి ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా అలరించింది.
ఇక నార్త్ ఇండియన్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఇందు పాత్రలో ఈ భామ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి ప్రేక్షకుల చేత జై కొట్టించుకుంది.

ఇందు తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకున్న పాత్ర రాధిక. టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించింది నేహా శెట్టి. ఈ బ్యూటీ అందానికి.. నటనకు.. ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇక ప్రేమించాను నిన్నే అనే సినిమాలో ఉమగా నటి శ్రీదేవి నెగిటివ్ రోల్లో అలరించింది. ధర్మయోగి సినిమాలో ధనుష్‌ను మోసం చేసే పాత్ర(రుద్ర)లో త్రిష అదరగొట్టింది. నీవెవరో చిత్రంలో కళావతిగా.. గుండెల్లో గోదారి సినిమాలో సరళగా తాప్సీ హీరోలను మోసం చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఇక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ బస్‌స్టాప్ చిత్రంలో సీమాగా ఆనంది.. మన్మథ మూవీలో వైష్ణవిగా సింధు తులానీ హీరోలను చీట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. త్రిష లేదా నయనతార చిత్రంలో మనీషా యాదవ్ (అదితి)గా ప్రేక్షకులను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అలరించింది.