Review : ‘ఊర్వశివో.. రాక్షశివో’ మూవీని లిప్​లాకులు గట్టెక్కించాయా..?

- Advertisement -

అల్లు శిరీష్.. అనూ ఇమ్మాన్యుయేల్.. చాలా రోజుల నుంచి ఈ ఇద్దరు ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఓ కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్​లో ఓ సినిమా చేశారు. డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వంలో శిరీష్-అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘ఊర్వ‌శివో రాక్ష‌సివో’ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో తెగ లవ్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో విడుద‌ల‌కి ముందే ఈసినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెలకొంది. సినిమా రిలీజ్ టైంలోనే శిరీష్, అనులు రిలేషన్​షిప్​లో ఉన్నారనే పుకార్లు రావడం ఈ మూవీపై మరింత బజ్​ని క్రియేట్ చేశాయి. మరి శిరీష్-అను జోడీ బిగ్ స్క్రీన్​పై మ్యాజిక్ చేశారా..? తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను వావ్ అనిపించారా..?

స్టోరీ ఏంటంటే.. శ్రీకుమార్ (అల్లు శిరీష్‌) మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన కుర్రాడు. సింధూజ (అను ఇమ్మాన్యుయేల్‌) అమెరికాలో ప‌నిచేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. ఇద్ద‌రూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటారు. సింధూని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు శ్రీకుమార్‌. ఆధునిక భావాలున్న ఆమె కూడా త‌క్కువ స‌మ‌యంలోనే అతడికి ద‌గ్గ‌ర‌వుతుంది. ఇద్ద‌రూ శారీర‌కంగా ఒక్క‌ట‌య్యాక శ్రీ త‌న ప్రేమ‌ని వ్య‌క్తం చేస్తాడు. ఆమె మాత్రం ప్రేమించడం లేద‌ని చెబుతుంది. మ‌రి మ‌న‌సులో ప్రేమ లేకుండానే శ్రీకి సింధు ఎలా ద‌గ్గ‌రైంది? ఇద్ద‌రూ క‌లిసి స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ప్పుడు ఏం చేశారు? వారిద్ద‌రికీ పెళ్లైందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

- Advertisement -

మూవీ ఎలా ఉంది..? నేటి మిలీనియల్ యూత్​ ఆలోచ‌న‌ల్ని ప్ర‌తిబింబించే క‌థ ఇది. శారీర‌క బంధం, ప్రేమ‌, క‌ల‌లు, ల‌క్ష్యాలు, స‌హ‌జీవ‌నం, పెళ్లి… త‌దిత‌ర విష‌యాల్ని ఆస‌క్తిక‌రంగా స్పృశించాడు ద‌ర్శ‌కుడు. క‌థ కొత్త‌దేమీ కాక‌పోయినా.. హాస్యం, భావోద్వేగాల్ని మేళ‌వించి కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ర‌చ‌న‌లో బ‌లం, ప్ర‌ధాన క‌థాంశంలో సంఘ‌ర్ష‌ణ‌, స‌న్నివేశాల్లో హాస్యం పండ‌టం సినిమాకి క‌లిసొచ్చింది. ఆరంభ స‌న్నివేశాలు కాస్త సాగ‌దీత‌గా అనిపించినా.. నాయకానాయిక‌ల జోడీ ద‌గ్గ‌ర‌య్యాక క‌థ ప‌రుగులు పెడుతుంది. ఆఫీసు వాతావ‌ర‌ణం, ఇద్దరి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు, కుటుంబ నేప‌థ్యంతో ప్ర‌థ‌మార్ధం స‌ర‌దాగా సాగిపోతుంది. ఓటీటీ, వెబ్‌సిరీస్‌తో ముడిపెడుతూ వెన్నెల కిషోర్ పండించిన కామెడీ, క్రికెట్‌తో పోలుస్తూ సునీల్ చేసే హంగామా న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. క‌థ‌నంలో బ‌లం లేక‌పోయినా, త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందిన‌ప్ప‌టికీ సంద‌ర్భోచితంగా హాస్యం పండ‌టంతో ఇత‌ర‌త్రా లోటుపాట్లేవీ బ‌య‌టికి క‌నిపించ‌వు. నాయిక‌నాయకుల మ‌ధ్య స‌హ‌జీవ‌నం మొద‌ల‌య్యాక సాగే హంగామా, ఆ నేప‌థ్యాన్ని కామెంట్రీ రూపంలో వెన్న‌ెల కిషోర్ – సునీల్ చెప్పిన తీరు, అక్క‌డ పండిన హాస్యం సినిమాకి హైలైట్‌. క‌థ‌లో భాగంగానే అయినా..  హీరో హీరోయిన్ల మ‌ధ్య ముద్దు స‌న్నివేశాలు హ‌ద్దులు దాటిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ సాదాసీదాగా అనిపించినా తెర‌పైన ఓ కొత్త అంశాన్ని వినోదాత్మ‌కంగా చ‌ర్చించిన అనుభూతి క‌లుగుతుంది.

యాక్టింగ్ ఓకేనా..? అల్లు శిరీష్ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబానికి చెందిన కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఓ ప‌క్క త‌ల్లిదండ్రుల‌కీ, మ‌రోప‌క్క ప్రేమించిన అమ్మాయికీ మ‌ధ్య న‌లిగిపోయే కుర్రాడిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. కామెడీ టైమింగ్ కూడా ఆక‌ట్టుకుంటుంది. క‌థానాయిక అను ఇమ్మాన్యుయేల్‌తో క‌లిసి మంచి కెమిస్ట్రీని కూడా పండించాడు. ఎమోషనల్ సీన్స్​లో, ఎక్సెప్రెషన్స్​లో శిరీష్ కాస్త ఫోకస్ చేయాల్సింది అనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ సినిమాకి హైలైట్‌. ఆధునిక‌, స్వ‌తంత్ర భావాలున్న యువ‌తిగా ఒదిగిపోయింది. ఆమె న‌ట‌న‌, హావ‌భావాలు ఆక‌ట్టుకుంటాయి. శిరీష్‌, అను కెరీర్‌కి క‌లిసొచ్చే చిత్ర‌మిది. వెన్నెల కిషోర్‌, సునీల్‌, పోసాని త‌దిత‌రుల హంగామా న‌వ్వించింది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అచ్చు – అనూప్ సంగీతం బాగుంది. పాట‌ల చిత్రీక‌ర‌ణ సినిమాలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లో ఒక‌టి. కథ‌, ర‌చ‌న‌లో కొత్త‌ద‌నం ఉంది. క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి విజ‌య‌వంత‌మ‌య్యాడు. నిర్మాణం బాగుంది.

చిత్రం: ఊర్వశివో రాక్షసివో; న‌టీన‌టులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్‌, సునీల్‌, పృథ్వీ, ఆమ‌ని, కేదార్ శంక‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌దిత‌రులు; సంగీతం: అచ్చు రాజమణి; ఛాయాగ్రహ‌ణం: తన్వీర్‌; కూర్పు: కార్తీక శ్రీనివాస్; నిర్మాణం: ధీరజ్ మొగిలినేని, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, విజ‌య్‌.ఎం; సమర్పకులు: అల్లు అరవింద్; నిర్మాణ సంస్థ: GA2 పిక్చర్స్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్; దర్శకుడు: రాకేష్ శశి; విడుద‌ల‌ తేదీ: 4-11-2022

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here