బ్రో సినిమా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సినిమా పేరు. తాజా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. విడుదలైన గంటలోనే కోటి వ్యూయర్ షిప్ సాధించింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ వినోదయ సీతం
సినిమాకు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెల 28న విడుదలకు సిద్ధం కాబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పేలా చేశారు.

ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి బ్రో సినిమాలో మొదట అనుకున్న హీరోలు పవన్, సాయి ధరమ్ తేజ్ కాదంట. మొదట వినోదయ సీతం రీమేక్ రైట్స్ కోసం నిర్మాత సురేష్ బాబు ప్రయత్నించారట. ఈ సినిమాని బాబాయి వెంకటేష్, అబ్బాయి రానా కాంబో లో తియ్యాలన్నది ఆయన ప్లాన్. సముద్రఖనిని కలవగా.. అందుకు ఆయన ఓకే చెప్పారట. ఇంతలోనే వినోదయ సీతంను చూసిన త్రివిక్రమ్.. సముద్రఖనిని కలిసి ఈ మూవీని పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో తీస్తే బాగుంటుందని సలహా చెప్పాడట. అప్పుడు సముద్రఖని ఇలా సురేష్ బాబు గారు కూడా ఈ సినిమా కోసం అడిగారని త్రివిక్రమ్ తో చెప్పాడట. దాంతో త్రివిక్రమ్ సురేష్ బాబుతో సంప్రదింపులు జరిపి ఆయనను వెనక్కి తగ్గేలా చేశారట. అలా వెంకీ, రానా చేయాల్సిన సినిమా.. త్రివిక్రమ్ కారణంగా పవన్, తేజ్ లకు దక్కింది.