Tiger Nageshwar Rao Review : మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ సినిమా కోసం రవితేజ ఎన్నో రిస్కీ ఫైట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అంత ఇష్టం తో చేసిన ఈ సినిమాకి ప్రొమోషన్స్ కూడా అదే స్థాయిలో చేసాడు. ముఖ్యంగా హిందీ ప్రొమోషన్స్ ని ఆయన ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అక్కడ పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ షోస్ లో ముఖ్య అతిధిగా పాల్గొని తన సినిమాకి ప్రమోషన్ చేసుకున్నాడు. అలా ఈ చిత్రం పట్ల ప్రతీ విషయం నూటికి నూరుపాళ్లు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసాడు రవితేజ. టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తో మూవీ పై అంచనాలు పెరిగాయి. ఈరోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
స్టూవర్టుపురం అనే ఊరిలో నాగేశ్వర రావు ( రవితేజ) పోలీసులకు ముచ్చమటలు పట్టిస్తూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దొంగతనం చేసే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడం అనేది నాగేశ్వర రావు స్టైల్. అలా దోచుకున్న డబ్బులను పేద ప్రజలకు పంచి పెడుతూ ఉంటాడు. అలా జీవనం సాగిస్తున్న నాగేశ్వర రావు జీవితం లోకి మార్వాడి అమ్మాయి (నుపుర్ సనన్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడుతాడు నాగేశ్వర రావు. ఇది పక్కన పెడితే జీవితం లో ఎన్నో దొంగతనాలు చేసి పోలీసులకు హడలు పుట్టించిన నాగేశ్వర రావు, ఏకంగా ప్రధాన మంత్రి ఇంట్లో దొంగతనం చెయ్యడానికి సిద్ధం అవుతాడు. అక్కడి సెక్యూరిటీ టైగర్ నాగేశ్వర రావు ని కనిపెట్టడానికి తల ప్రాణం తోకకి వస్తుంది. చివరికి ఏమైంది?, టైగర్ నాగేశ్వర రావు ఎందుకు ప్రధాన మంత్రి ఇంట్లో దొంగతనం కి పాల్పడ్డాడు?, అసలు ఆయన ఎందుకు ఇలా రాబిన్ హుడ్ లాగ తయారు కావాల్సి వచ్చింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోండి.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం నుండే డైరెక్టర్ వంశీ అదిరిపోయే యాక్షన్ బ్లాక్ తో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాడు. అలా అంత హై సీన్ తో ప్రారంభమైన ఈ సినిమా అదే ఊపు తో కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే మొత్తం చాలా ఎంగేజింగ్ ఉండేట్టు చూసుకున్నాడు. మధ్యలో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించినా, స్టోరీ లో ఇమిడిపోయి చూడడం మొదలు పెడుతాం. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ మరియు మాస్ యాక్షన్ తో నింపేసాడు డైరెక్టర్ వంశీ. ఇక సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఎమోషనల్ డ్రామా కోసం ప్రయత్నం చేసాడు. కానీ చాలా సన్నివేశాలు అవసరం లేనివి పెట్టడం వల్ల సినిమా డ్రాగ్ అయినా ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. అవి లేకుండా, తక్కువ రన్ టైం లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ డీల్ చేసి ఉంటే, ఈరోజు ఈ టైగర్ నాగేశ్వర రావు ఇండస్ట్రీ లో రికార్డ్స్ బ్రేక్ చేసేవాడు, కానీ ఓవరాల్ గా పర్లేదు బాగుంది అనే రేంజ్ లో మాత్రమే ఉండిపోయింది ఈ సినిమా.
ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రవితేజ కి ఈమధ్య కాలం లో పడిన ది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఆయన డైలాగ్ డెలివరీ, గెటప్, యాక్టింగ్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా కొత్తగా ఉండేలా చూసుకున్నాడు. ఇక నుపుర్ సనన్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ కి చెల్లెలు అనే విషయం మన అందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఆమె కూడా చాలా చక్కగా తన పరిధిమేర నటించింది. ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపు గా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రం గానే ఉంది.
నటీటీనటులు: రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్ , మురళి శర్మ తదితరులు.
రచన – దర్శకత్వం : వంశీ
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
బ్యానర్ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
చివరి మాట :
ఓవరాల్ గా టైగర్ నాగేశ్వరావు చిత్రం ఈ దసరా రేస్ లో నిల్చిన ఒక మంచి యాక్షన్ డ్రామా.
రేటింగ్ : 2.75 /5