Thaman : గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ పూర్తి పాట వచ్చేసింది. అయితే, ప్రోమో నుంచే ఈ పాటపై రచ్చ జరుగుతోంది. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పాటనా అని కొందరు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటకు ఎలా ఓకే చెప్పారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మాస్ యాక్షన్ మూవీలో ఈ పాట ఉండడం సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. ఈ చర్చల మధ్య నేడు గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ పుల్ రిలికల్ సాంగ్ వచ్చింది.

అయితే, ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్యూన్ కాపీ కొట్టేశాడంటూ కొందరు నెటిజన్లు వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు. ‘కుర్చీ మడత పెట్టి’ పాట చరణంలో ‘ఏం రసికరాజువో’ మరి అంటూ లిరిక్స్ ఉన్నాయి. అయితే, అక్కడ అత్తారింటికి దారేది సినిమాలోని ‘బేట్రాయి సామి దేవుడా’ జానపద పాట ట్యూన్‍ను థమన్ కాపీ కొట్టాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆ పాటను.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‍ను కలిపి వీడియోలు చేస్తున్నారు. అత్తారింటికి దారేది ట్యూన్‍ను థమన్ కొట్టేశాడంటూ పోస్టులు చేస్తున్నారు.

థమన్‍ను ట్రోల్ చేస్తున్నారు. ఇది వైరల్‍గా మారింది. ఇప్పటికే ‘కుర్చీ మడతపెట్టి’ పాట కోసం డీజే పాటలను కాపీ కొట్టారంటూ ప్రోమో చూసినప్పుడు థమన్‍పై కొందరు ఆరోపించారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ రావటంతో ‘బేట్రాయి సామిదేవుడా’ ట్యూన్‍ను కూడా కొట్టేశావంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ‘కుర్చీ మడతపెట్టి’ పాట రచ్చ అవుతోంది. ఓ బూతు వల్ల వైరల్ అయిన ఈ డైలాగ్‍ను మహేశ్ బాబు పాటకు వాడడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.