మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మొదలై 20 ఏళ్లు కావస్తోంది. అయినా ఆమె జోరు తగ్గడం లేదు. ఇటు తెలుగు, తమిళ్, అటు బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వాటిలో చిరంజీవి, రజనీకాంత్ సరసన నటించిన క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ‘భోళా శంకర్’ ఈ నెల 11న విడుదలవనుంది. రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘జైలర్’ చిత్రం ఆ ముందు రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఓవైపు మెగాస్టార్, మరోవైపు సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే తన కల నెరవేరిందని తమన్నా చెబుతోంది. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల కానుండడంతో ఆనందం, ఉద్వేగం రెండూ కలుగుతున్నాయని అంటోంది. ఈ చిత్రాల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘నేను నటించిన ‘భోళా శంకర్’ ‘జైలర్’ చిత్రాలు ఒక్కరోజు వ్యవధిలో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఇద్దరు సూపర్‌స్టార్స్ సినిమాల్లో నేను భాగం కావడంతో నా కల నిజమైంది. ‘భోళా శంకర్’ తమిళ ‘వేదాళం’కు రీమేక్. అయితే తమిళ సినిమా వచ్చి చాలా రోజులైంది. దాంతో నేటి ట్రెండ్‌కు తగ్గట్లు తెలుగు వెర్షన్లో మార్పులు చేశారు. నా పాత్రను కూడా కొత్తగా తీర్చిదిద్దారు. ఇక ‘జైలర్’లో పూర్తి విభిన్నమైన పాత్రలో కనిపిస్తా. ‘సైరా’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించాను. కానీ ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం రాలేదు. ‘భోళా శంకర్’తో ఆ లోటు తీరింది. చిరంజీవితో స్టెప్పులేయడం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గానే ఉంటుంది.
‘మిల్కీ బ్యూటీ’ అనే రొమాంటిక్ పాటలో మంచి నృత్యాలుంటాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ వంటి టాలెంటెడ్ హీరోయిన్‌తో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. హీరోయిన్గా దాదాపు 20 ఏళ్లుగా రాణిస్తున్నా. నేను సినిమాను అమితంగా ప్రేమిస్తాను. ఎంతమంది నాయికలు వచ్చినా వారిని పోటీగా భావించను. పరిశ్రమలో ఇన్నేళ్లు నిలదొక్కుకోవడానికి సినిమా పట్ల నా అంకితభావం, క్రమశిక్షణే కారణం అనుకుంటున్నా. ప్రస్తుతం కెరీర్లో చాలా బిజీగా ఉన్నా. నేనేదైనా ముక్కు సూటిగానే మాట్లాడతా. ప్రేమ విషయాన్ని నాకు నేనుగానే బయటపెట్టా. అలాగే పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా వెల్లడిస్తా. ఇప్పటికైతే అలాంటి ప్రణాళికలేం లేవు ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పింది.