Tamanna : బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ. హైదరాబాద్‌కు చెందిన ఈయన తెలుగుకంటే హిందీలోనే వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ‘‘ఒకానొక సమయంలో నా వద్ద డబ్బుల్లేవు. బ్యాంకు ఖాతాలో రూ. 18 ఉన్నాయి.
ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. అప్పుడే ఓ సినిమా టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక్కరోజు రిపోర్టర్‌గా నటిస్తే రూ. 3000 ఇస్తామని చెప్పారు. అలాంటి చిన్న పాత్రలు పోషించడం ఇష్టంలేకపోయినా డబ్బు కోసం మనసు చంపుకొని వెళ్లా. ఇంగ్లిష్ రిపోర్టర్‌గా నటించాలనే విషయం అక్కడకు వెళ్లాక తెలిసింది. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం అంత తేలిక అనిపించలేదు. చివరకు రిజెక్ట్ అయ్యా. అయితే, అప్పటికే నేను ‘మాన్సూన్ షూటౌట్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించా.
అయినా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెట్స్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సంఘటన తలచుకుని ఏడ్చేశా. 2014లో జరిగిన సంగతి ఇది. డబ్బు కోసం నచ్చని పాత్రల్లో నటించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆ మేరకు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇష్టపడిన పాత్రలే తప్ప డబ్బు కోసం ఏదీ చేయలేదు’’ అని తెలిపారు. ప్రముఖ హీరోయిన్ తమన్నా బాయ్ఫ్రెండ్గానూ విజయ్ ఇటీవల పాపులర్ అయ్యారు. 2008లో ఓ షార్ట్‌ఫిల్మ్‌తో నటుడిగా మారిన ఆయన ‘చిట్టగాంగ్’ (2012)తో తొలిసారి వెండితెరపై కనిపించారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్’ సినిమాలో అంకిత్ మల్హోత్రగా విశేషంగా ఆకట్టుకున్నారు.