Guntur Kaaram : దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి గతంలో చేసిన ఎన్నో సినిమాలు మాంచి హిట్స్‌గా నిలిచాయి. అయితే తరువాత కొన్ని వరుస డిజాస్టర్లు ఎదురు కావడంతో దర్శకత్వానికి దూరమయ్యారు. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తన తాజా ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి తన ఫ్లాపుల గురించి మాట్లాడుతూ మొన్న సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో టాప్ హీరో సినిమాను ఉదహరిస్తూ ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో, అప్పుడే తేడా కొడుతుందని అప్పటి టాప్ హీరో అయినా ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం అయినా అదే అవుతుందని అన్నారు. మహేష్ బాబు స్టార్డంకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదని అన్నారు. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి కానీ హీరోల స్టార్ డంను నమ్ముకుంటే ఇబ్బందే అన్నారు. యమలీల అందుకే పెద్ద హిట్ అయిందని మిగతా సినిమాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు.
ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక జనవరి 12న రీలీజైన ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.