కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర నోరు జారారు. ఫలితంగా ఆయనపై స్టేషన్లో కేసు నమోదైంది. దళితులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీనికి పశ్చాత్తాపంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఉపేంద్ర ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఫేస్ బుక్, ఇన్ స్టా లైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సమయంలోనే తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అప్పుడే ఆయన అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు.

ఉపేంద్ర తన ఫేస్ బుక్ సెషన్లో మాట్లాడుతూ.. కల్మషం లేని హృదయంతోనే మార్పు సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి వాళ్లే తన వెంట రావాలని కోరారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా తనతో పంచుకోవాలని కోరారు. అలాంటి వారి సలహాలు అందరికీ మేలు చేస్తాయని తెలిపారు. వాళ్లే ఇతరులను అవమానించరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని పేర్కొన్నారు. కానీ కొందరు చాలా ఖాళీగా ఉండి ఇష్టమొచ్చినట్లు వాగుతుంటారు. ఉంటారు. ఓ ఊరుంటే అందులో తప్పని సరిగా దళితులు ఉన్నట్లు వాళ్లు కూడా ఉంటారు. వాళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. ప్రజలపై ప్రేమాభిమానాలు ఉండడమే నిజమైన దేశభక్తని ఉపేంద్ర పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో విమర్శలు చేసే వారిని దళితులతో పోల్చి చిక్కుల్లో పడ్డారు.

వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో ఉపేంద్ర పై ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అంతటితో ఆగకుండా రామనగర ప్రాంతంలో నిరసన తెలిపారు. హీరో ఉపేంద్ర పోస్టర్లను తగులబెట్టారు. ఈ క్రమంలోనే ఉపేంద్ర పై చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. వెంటనే ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. దీంతో కొందరు పబ్లిక్ ఫిగర్ గా ప్రజలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్న హీరో, రాజకీయ నాయకుడు తన మద్దతుదారులకు ఆదర్శప్రాయంగా నిలవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడరాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.