Vijay Thalapathy : ‘కెప్టెన్’ విజయకాంత్ గురువారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. నిన్న (శుక్రవారం, డిసెంబర్ 29న) చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఐలాండ్ మైదానంలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. తమిళ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చారు. అందులో దళపతి విజయ్ కూడా ఉన్నారు. అయితే… అనుకోని ఘటన ఆయనకు ఎదురైంది.

విజయకాంత్ అంత్యక్రియలకు వచ్చిన విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఒకరు షూ విసిరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు వద్దకు విజయ్ వెళుతుండగా ఎవరో షూ విసిరారు. అది ఆయనకు వెనుక నుంచి తగిలింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో విజయకాంత్‌కు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ… విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’ సినిమాలతో బ్రేక్ అందుకున్నారు.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వెండితెరపై విజయకాంత్ ప్రయాణం విజయవంతంగా సాగింది. ఆయన 150కు పైగా సినిమాలు చేశారు. హీరోగా ఆయన వందో సినిమా ‘కెప్టెన్ ప్రభాకరన్’. ఆ సినిమా తర్వాత నుంచి విజయకాంత్ ను తమిళ ప్రేక్షకులు అందరూ ‘కెప్టెన్ విజయకాంత్’ అని పిలవడం ప్రారంభించారు. అంతకు ముందు ‘పురట్చి కలైంజర్’ (విప్లవ కళాకారుడు) అని పిలిచేవారు.