జానపద పాటలతో ప్రారంభమై.. నేడు సినీ ప్రేక్షకులను సైతం తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీకి గాయాలైనట్టు సోమవారం పలు వార్తలు వచ్చాయి. ఓ పాట కోసం మంగ్లీ కొన్ని రోజులుగా షూటింగ్స్‌లో పాల్గొంటోందని, అప్పుడే ఆమెకు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఆమె కాలికి స్వల్పంగా గాయాలయ్యాయని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగ్లీనే స్వయంగా దీనిపై స్పందించింది. ఈ తరహా వార్తలు నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణలో ప్రతీ సంవత్సరం నిర్వహించే బోనాల పండుగలో భాగంగా మంగ్లీ యూట్యూబ్ లో ఓ పాటను రిలీజ్ చేస్తుంటుంది. అందులో భాగంగానే మంగ్లీ ఓ సాంగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ పాటను షూట్ చేస్తున్న సమయంలోనే మంగ్లీ కాలు జారి కింద పడిపోవడం, కాలికి స్వల్పంగా గాయం అయిందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారని, గాయం చిన్నదే కావడంతో ఆమె త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెప్పినట్లుగా ప్రచారం జరగడంతో మంగ్లీ స్పందించక తప్పలేదు.
టాలీవుడ్ ఫోక్ సింగర్ గా మంగ్లీ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బతుకమ్మ, బోనాలు, గణేష్ చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడి.. ఇలా పలు పండగలు, దేవుళ్లపై ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయింది. దీనికి తోడు ఆమె వాయిస్ కూడా ఇనసొంపుగా ఉండడంతో ఆమె పాడే పాటలకు ఎనలేని డిమాండ్ ఉంటుంది. యూట్యూబ్ లో ఆమె సాంగ్స్ రిలీజ్ అయ్యాయంటే చాలు.. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ అందుకుంటాయి. సినిమా, జానపద గేయాలతో ఫుల్ బిజీగా మారిన సింగర్ మంగ్లీ.. భక్తి పాటలతో పాటు రవితేజ ‘ధమాకా’లోని ‘జింతాక్కా’, ‘అల వైకుంఠపురములో‘ని ‘రాములో రాములా’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలో ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’, ‘శైలజా రెడ్డి అల్లుడు చూడే’ వంటి పాటలతో యమ క్రేజ్ అందుకుంది.