రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా విశేషాలతో పాటు.. విజయ్ దేవరకొండ, సమంతలతో కలిసి పనిచేసిన అనుభూతిని పంచుకున్నారు.

‘‘ఖుషి’లో విజయ్ దేవరకొండ ఎనర్జీ, సమంత అందం ప్రేక్షకులను అలరిస్తాయి. వారి పాత్రలకు ప్రాణం పోసేందుకు విజయ్, సమంత ఇద్దరూ ఎంత కష్టమైనా పడతారు. ఏ విషయంలోనూ భయపడరు. సన్నివేశం బాగా వచ్చే వరకు రాజీపడరు. వీళ్లిద్దరి రొమాన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా కోసం సర్వస్వం త్యాగం చేస్తారు. ‘మజిలీ’ సినిమా సమయం నుంచే సమంత నాకు తెలుసు. తన నటనకు నేను పెద్ద అభిమానిని. ఇక విజయ్‌ని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. వీళ్ల కాంబినేషన్‌కు నేను దర్శకత్వం వహించడం గొప్ప అనుభూతినిచ్చింది. వీళ్లు నా స్క్రిప్ట్‌కు ప్రాణం పోశారు.

వీళ్లిద్దరూ కాకుండా మరొకరు అయితే ‘ఖుషి’ ఇంత బాగుండేది కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ్, సమంతలు మ్యాజిక్‌ను క్రియేట్ చేశారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులంతా దాన్ని అనుభూతి చెందుతారు’’ అని శివ నిర్వాణ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన దగ్గరి నుంచే సినీప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన పాటలు వాటిని రెట్టింపు చేశాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూవ్స్ సాధించాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.