Prabhas : షారుక్‌ఖాన్ కథానాయకుడిగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డంకీ’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 22న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రభాస్ ‘సలార్’ కూడా అదే రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో ఇప్పుడు ‘డంకీ’ విడుదల తేదీలో స్వల్ప మార్పును చేసింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను డిసెంబరు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం పంచుకుంది.

‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే భారత్ కాకుండా ఇతర దేశాల్లో డిసెంబరు 21న ‘డంకీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ యథావిధిగా డిసెంబరు 22నే విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి షారుక్ లుక్, టీజర్ ఏదీ విడుదల కాలేదు. అసలు డిసెంబరులో ఈ మూవీ వస్తుందా? లేదా? అన్న సందేహం కూడా అభిమానుల్లో ఉంది.

ప్రభాస్ ‘సలార్’వస్తుండటంతో ‘డంకీ’ వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని ఇప్పటికే చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. తాజాగా అంతర్జాతీయంగా సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో విడుదల వాయిదా వార్తలకు మరోసారి చెక్ పెట్టినట్లైంది. ఇక ఈ సినిమాలో తాప్సీ, దియా మీర్జా, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరీఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్ పాండేలు నిర్మిస్తున్నారు.