Satyam Rajesh : దిల్ రాజు, ఆహుతి ప్రసాద్, బాహుబలి ప్రభాకర్.. ఇవన్నీ వారి నిజమైన పేర్లకు పక్కన వారి కెరీర్ మొదట్లో ది బెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా, ఆ పాత్రల పేర్లు. ఇలా సినిమాలు, వారు నటించిన పాత్రల పేరే తమ ఒరిజినల్ నేమ్ గా పేరొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో సత్యం రాజేశ్ ఒకరు. సత్యం సినిమాలో నటించిన రాజేశ్.. ఆ చిత్రంలో తన నటనకు ఆ పాత్రకు వచ్చిన పాపులారిటీతో సత్యం రాజేశ్ గా మారిపోయాడు. అలా అప్పటి నుంచి టాలీవుడ్ లో కమెడియన్ గా స్థిరపడిపోయాడు. ఇప్పటి వరకు దాదాపు 350 చిత్రాల్లో నటించిన రాజేశ్.. 300 సినిమాల వరకూ కమెడియన్ గానే నటించాడు. కొన్ని చిత్రాల్లో మాత్రం సీరియస్ రోల్స్ లో కనిపించి అలరించాడు.
కమెడియన్ గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన రాజేశ్ ఇప్పుడు హీరోగా మారాడు. ఇటీవల నటించిన ‘పొలిమేర-2’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో ఆయన ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అయితే కమెడియన్ గానే కాకుండా సత్యం రాజేశ్ ఇతర సీరియస్ రోల్స్ లోనూ నటించాడు. అందులో చాలా పాత్రల్లో తన నటనలోని ఇంటెన్సిటీని కూడా చూపించాడు. కానీ దర్శక నిర్మాతలెవరూ ఆ యాంగిల్ ను పట్టుకోలేకపోయారు. వారంతా తనలోని కామెడీ యాంగిల్ కే పరిమితమయ్యారు. కానీ క్షణం సినిమా డైరెక్టర్ మాత్రం రాజేశ్ లోని పొటిన్షియాలిటీ చూశారు. తన సినిమాలో ఓ సీరియస్ కాప్ రోల్ ఇచ్చాడు. ఆ సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. అందులో సత్యం రాజేశ్ పాత్ర ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు.
ఈ సినిమా సత్యం రాజేశ్ కెరీర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పొచ్చు. అప్పటివరకు కామెడీ పాత్రల్లో మెప్పించిన ఆయన సీరియస్ పాత్రల్లోనూ అదరగొట్టేయగలడని దర్శకులు నమ్మారు. అందుకే ఆ తర్వాత కూడా అలాంటి పోలీసు పాత్రలో ఆయన వద్దకు ఎక్కువగా వెళ్లాయట. దీంతో మొనాటనీ వచ్చేస్తుందని ఆయన వాటన్నింటిని రిజెక్ట్ చేశాడట. అలా దాదాపు 50 సినిమాలు వదులుకున్నాడట. సత్యం రాజేశ్ కు ప్రకాశ్ రాజ్, రఘువరన్ లా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడమంటే ఇష్టమట.
పొలిమేర చిత్రంతో సత్యం రాజేశ్ కాలిబర్ ను సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు గుర్తించారు. ఈ చిత్రంలో ఆయన తన నటవిశ్వరూపాన్ని చూపించారు. పొలిమేర, పొలిమేర-2లతో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయిపోయాడు. ఆ పాపులారిటీ చూసిన మేకర్స్ ఇప్పుడు ఆయనతో పొలిమేర-3 కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. అలా ఓ కమెడియన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టిన సత్యం రాజేశ్ మొత్తానికి పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడన్నమాట.