సీనియర్ నటుడు శరత్ బాబు (71) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి చేయిదాటడంతో కన్నుమూశారు. శరత్ బాబు మరణవార్తతో తీవ్ర టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన ఇక లేరని తెలిసి పలువురు సినీ నటులు శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సినీ కెరీర్ పరంగా రారాజుగా వెలిగిన శరత్ బాబు పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని చేదు ఘటనలు ఉన్నాయి.
వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నారు శరత్ బాబు. తనకంటే వయసులో ఐదారేళ్లు పెద్దదైన సినీ నటి రమా ప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన.. కొన్నేళ్ల పాటు కాపురం చేసి ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు.. ఆమెతో సక్సెస్ ఫుల్ లైఫ్ గడపలేకపోయారు. కారణాలు ఏమైనప్పటికీ కొన్నేళ్ళకే ఈ జోడీ విడిపోయింది. అయితే శరత్ బాబుతో విడిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడిన రమాప్రభ.. శరత్ బాబు తనను మోసం చేశారని, ఆస్తి కూడా లాక్కున్నారని చెప్పింది. శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ తనకి జరిగిన అన్యాయం తలచుకుని బాధపడింది.
చాలా ఇంటర్వ్యూల్లో శరత్ బాబు వ్యక్తిత్వాన్ని దూషిస్తూ మాట్లాడింది రమాప్రభ. అయితే ఈ వివాదంలో శరత్ బాబు కూడా తన వర్షన్ చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రమాప్రభతో పెళ్లి గురించి శరత్ బాబు ప్రస్తావించారు. ఇద్దరికి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటపెట్టారు. రమాప్రభకు ఆస్తులు లేవని, తానే ఆమెకు కొన్ని కోట్ల విలువచేసే ఆస్తులు ఇచ్చానని శరత్ బాబు అన్నారు. వాటి విలువ సుమారు రూ.100కోట్లు ఉంటుందన్నారు. అసలు విషయం తెలియక అందరూ తనను విమర్శిస్తున్నారు.. కానీ అప్పట్లో నా ఆస్తి అమ్మి రమాప్రభ పేరు మీద ఒక ప్రాపర్టీ, ఆమె తమ్ముడి పేరుమీద మరొకటి, ఇద్దరి పేరుమీద మరొకటి ఇలా మూడు ప్రాపర్టీలు కొనిచ్చానని శరత్ బాబు తెలిపారు.