Ram Charan : విజయ్ దేవరకొండ స్టార్ హీరో కావడం వెనుక, యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ రావడం వెనుక కారణం సందీప్ రెడ్డి! ఆయన దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా! తొలి సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలనాలు సృష్టించారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఓ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చిందని టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అయితే... ఆ సినిమా ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు.

మహేష్ బాబుతో సినిమా ఎందుకు మిస్ అయ్యిందో లేదో చెప్పారు సందీప్ రెడ్డి వంగా. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా… ఆ తర్వాత అదే కథను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రమది. అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది. ‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దర్శకుడు మాట్లాడారు. ”మహేష్ బాబు గారికి నేను ఒక కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. మహేష్ బాబు గారితో మాత్రమే కాదు రామ్ చరణ్ గారితోనూ, మిగతా హీరోలతోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.