Sameera Reddy: సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ గంటగంటకు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలామంది బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం చూసే ఉన్నాం. కొంతకాలం క్రితం సీనియర్ నటి జయలలిత తన కెరీర్లో ఎదురైన వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండస్ట్రీలో పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్న వాళ్ల చేతుల్లో కొన్ని సార్లు నలిగిపోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.
సినిమాల్లో అవకాశాలు, కమిట్మెంట్ ల గురించి బిగ్ బాస్ నటి హిమజ సైతం స్పందించారు. కమిట్మెంట్ ఇస్తేనే సినిమాల్లో అవకావాలు వస్తాయనేది ఓ రూమర్ మాత్రమే అని హిమజ తెలిపారు. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఛాన్స్ లు రావడం లేదు. అలాగే వచ్చిన వాళ్లందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని హిమజ చెప్పుకొచ్చారు. 1990ల్లో సీనియర్ నటి ఆమని టాప్ హీరోయిన్గా కొనసాగారు. ఆమె కూడా తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఓ తమిళ దర్శకుడు నన్ను ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అంటూ ఓపెన్ గానే అడిగాడు..దీంతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని చెప్పింది.
తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో బ్రెస్ట్ గురించి విపరీతమైన చర్చ జరిగేదని..ఆ సమయంలో చాలా మంది తనని ఆపరేషన్ చేయించుకోమని ఒత్తిడి చేశారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. హీరోయిన్గా సినిమాలు చేసే టైంలో శరీరంలో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ చేయించుకోమని బాగా ఒత్తిడి చేశారు. చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైందని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు. నాకు అది ఇష్టం లేదని చెప్పినా వినేవారు కాదు. ఆ సమయంలో చాలా బాధపడ్డానని ఎమోషనల్ అయ్యింది. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలనంటూ సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.