టాలీవుడ్ కి ఫ్యాక్షన్ జానర్ ని పరిచయం చేసిన హీరో నందమూరి బాలకృష్ణ అనే సంగతి అందరికీ తెలిసిందే. బి గోపాల్ దర్శకత్వం లో బాలయ్య బాబు హీరో గా తెరకెక్కిన ‘సమర సింహా రెడ్డి’ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 1 ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. బాలయ్య ఊర మాస్ యాక్షన్ తో పాటుగా, సీమ పౌరుషం అక్కడి పగ ప్రతీకారాలు ఎలా ఉంటాయో, అవన్నీ ఈ చిత్రం లో చూపించారు.
ఇక ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. కేవలం పాటలకోసమే సినిమాకి వెళ్లిన ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇక ఈ చిత్రం లోని ట్రైన్ సన్నివేశం అప్పట్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. ఆరోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా 16 నుండి 17 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించిందట.
అయితే ఈ సినిమాని తొలుత నందమూరి బాలకృష్ణ తో చేద్దాం అని అనుకోలేదట, విక్టరీ వెంకటేష్ తో ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నారట డైరెక్టర్ బి గోపాల్. వెంకటేష్ కి కథ బాగా నచ్చింది కానీ, తనకి ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు, నాతో కాకుండా చిరంజీవి లేదా బాలయ్య తో తీసుకోండి అని అన్నాడట. మీ ఇమేజి ని పూర్తిగా మార్చే చిత్రం గా నిలుస్తుంది, కచ్చితంగా మీకు సూట్ అవుతుంది చెయ్యండి అని ఎంత బ్రతిమిలాడినా వెంకటేష్ ఒప్పుకోలేదట. ఆ తర్వాత బాలయ్య బాబు ని కలిసి ఈ కథని వినిపించగానే సింగల్ సిట్టింగ్ లో సినిమాని ఓకే చేసినట్టు సమాచారం.
అయితే వెంకటేష్ ఈ సినిమా సాధించిన విజయాన్ని చూసి ,ఒప్పుకొని చేసి ఉంటే బాగుండేది అని అనిపించిందట. ఆ సమయం లో N శంకర్ అనే దర్శకుడు ‘జయం మనదిరా’ అనే సెమీ ఫ్యాక్షన్ కథతో వెంకటేష్ వద్దకి వచ్చాడు. ఆయనకీ కథ బాగా నచ్చడం తో, అప్పటికే సమర సింహా రెడ్డి చిత్రాన్ని వదులుకున్నానే అనే గిల్ట్ లో ఉన్న వెంకటేష్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సమర సింహా రెడ్డి విడుదలైన మరుసటి సంవత్సరం లోనే జయం మనదేరా చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది.