Adipurush : గతేడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ‘ఆదిపురుష్’ సినిమా. సినిమా విడుదలైన 7 నెలల తర్వాత ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. ఆదిపురుష్ అపజయం తర్వాత తను ఎలా ఫీలయ్యారో షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ గతేడాది జూన్ 16న విడుదలైంది.
రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి సిరీస్-రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమాను దాదాపుగా 103 రోజులపాటు షూట్ చేశారు. అయితే అనుకున్నట్లుగా ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో మూవీ టీమ్ పెద్దగా మాట్లాడలేదు. ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) గా నటించిన సైఫ్ అలీఖాన్ లుక్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమా డిజాస్టర్‌పై ఆ నటుడు 7 నెలల తర్వాత మొదటిసారి స్పందించారు. చిత్రాల విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలను ఎంపిక చేసుకునే విషయంలో సైఫ్ మాట్లాడారు.
ఇందుకు ఆదిపురుష్‍ను ఉదాహణగా చెబుతూ స్పందించారు. “రిస్క్‌ల గురించి జనాలు మాట్లాడుతుంటారు. అయితే, ఏదైనా కొత్తగా ప్రయత్నించే క్రమంలో వైఫల్యం ఎదురైతే.. అది నిజంగా రిస్క్ కాదు. అలాంటివి కూడా కొన్ని ఉండాలి. ఇది మన విధానంలో ఓ భాగమే. మీరు దాన్ని గుర్తించాలి. కాస్త బాధపడాలి. ప్రయత్నం బాగుందని, కానీ దురదృష్టమని భావించాలి. ఆ తర్వాతి దాని కోసం ముందుకు సాగాలి” అని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు.