Sai Dharam Tej : అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి ఆలోచనతో ఈ మెగా హీరో ముందుకొచ్చాడు. అంతే కాకుండా తను తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రేక్షకుల సపోర్ట్‌ను కూడా కోరుకుంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ నోట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్.

‘ఇది నా హీరోల కోసం. మనమందరం ఇక్కడ ఏదో ఒక మార్పు తీసుకురావడానికే వచ్చాం. నేను నా జీవితంలో మరో సంవత్సరం ముందుకు వెళ్తున్నందుకు నా మనసుకు దగ్గరయిన ఒక మార్పును చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పుట్టినరోజున నేను రూ.10 లక్షలు వీరనారీలకు అంటే ఆర్మీలో ఉంటూ మన భవిష్యత్తు కోసం వారి నేటిని త్యాగం చేస్తూ మరణించిన సైనికుల భార్యలకు విరాళంగా ఇస్తానని మాటిస్తున్నాను.

అంతే కాకుండా రూ.10 లక్షలు మన ప్రతీరోజూ రక్షణ కోసం కష్టపడుతున్న బాధ్యతగల ఏపీ, తెలంగాణ పోలీసులకు విరాళంగా ఇస్తున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అది మీ విరాళాల రూపంలో కాదు. సైనికులు, ఆర్మీ, పోలీసులు మనకోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం, గౌరవం రూపంలో’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట.. నెటిజన్లను మరింత ఎక్కువగా ఆకట్టుకుంది. తనలాగానే ఇతరులు కూడా సైనికులకు, పోలీసులకు, వారు పడే కష్టాలకు కాస్త మర్యద ఇచ్చిన చాలు అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.