దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా అవార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ సినిమా.. అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కగా.. ఇప్పుడీ చిత్రానికి మరో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమా పురస్కారాన్ని అందుకుంది. అలానే ఈ చిత్రంలోని నాటు నాటు పాట .. బెస్ట్ సాంగ్ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి అవార్డును అందుకుంటున్నట్లు కనిపించారు.
కాగా, ఈ పురస్కారాలు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ‘ఆస్కార్’ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఇది ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్ అవుతాయి.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, ఒలివియా మోర్రీస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
మరోవైపు హాలీవుడ్ స్టార్ దర్శకుడు, టైటానిక్, అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాను ఈ సినిమాను రెండు సార్లు చూసినట్లు దర్శకుడు రాజమౌళితో చెప్పారు. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా సోషల్‌మీడియాలో తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
“ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు. నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్(జేమ్స్ కామెరూన్). మీ ఇద్దరికి ధన్యవాదాలు.” అని జక్కన్న పేర్కొన్నారు.
ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “ది గ్రేట్స్ జేమ్స్ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్‌పై ఆయన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్ట్మెంట్గా ఉంది” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
‘ఆస్కార్’ ఓటింగ్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లోని సన్‌సెట్ టవర్స్‌లో తాజాగా యూనివర్సల్ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్‌కు చెందిన స్టార్ సెలబ్రిటీలందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కుటుంబసమేతంగా అమెరికాకు వెళ్లిన జక్కన్న, సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా యూనివర్సల్ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో రాజమౌళి.. మొదటిసారిగా హాలీవుడ్ డైరెక్టర్ స్పిల్ బర్గ్‌ను కలిశారు. ఆయనతో దిగిన పలు ఫొటోలను రాజమౌళి ట్విటర్ వేదికగా షేర్ చేసి.. “నేను దేవుడిని ఇప్పుడే కలిశాను” అంటూ తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు.
“గాడ్ ఆఫ్ మూవీస్‌గా అభివర్ణించే స్పిల్‌బర్గ్‌ను కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. ‘నాటు నాటు’ ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటల్ని నేనింకా నమ్మలేకపోతున్నా” అని కీరవాణి రాసుకొచ్చారు. ‘జురాసిక్ పార్క్’, ‘హుక్’, ‘ది టర్మినల్’, ‘ది పోస్ట్’ వంటి గొప్ప చిత్రాలకు స్పిల్బర్గ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.