RRR Movie : కరోనా పుణ్యమా అని సినిమాల విషయంలో ప్రేక్షకుల టేస్టే మారిపోయింది. ఇన్నాళ్లు థియేటర్లో రీజినల్, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూసిన ఆడియెన్స్ లాక్ డౌన్ లో ఓటీటీల బాట పట్టి.. సినిమాల విషయంలో హద్దులు చెరిపేశారు. అలా నేషనల్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మూవీస్ కు కూడా ఫిదా అయ్యారు. లాక్ డౌన్ లో చాలా మంది విదేశీ సినిమాలు, సిరీస్ లు చూసి అక్కడి కంటెంట్ కు, సినిమా టేకింగ్ కు మంత్రముగ్ధులయ్యారు. అలాగే విదేశీయులు కూడా ఇండియన్ సినిమా సత్తా ఏంటో కరోనా టైమ్ లో రుచి చూశారు.
ముఖ్యంగా జపనీయులు ఇండియన్ సినిమా అన్నా.. భారతీయ సంస్కృతి అన్నా ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే మనవాళ్లు కూడా కంటెంట్ ఉన్న మన సినిమాలను జపనీస్ భాషలోకి అనువాదం చేస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ముత్తు, బాహుబలి వంటి మూవీస్ జపనీస్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి ఆర్ఆర్ఆర్ సినిమా చేరింది.
ముత్తు సినిమా తర్వాతా ఆ రేంజ్ లో జపనీయులు ఇరగబడి చూసిన మూవీ బాహుబలి-2. ఈ సినిమాతో ప్రభాస్, రానా, రాజమౌళి పేర్లు జపాన్‌లో మారుమోగిపోయాయి. అందుకే జక్కన తన నెక్స్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ను జపాన్ లో కూడా రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’పై కూడా జపాన్ ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. ‘బాహుబలి 2’ను మించి ‘ఆర్ఆర్ఆర్’ను ఇరగబడి చూసేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో అత్యధికంగా వసూలు చేసిన రెండో ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ‘బాహుబలి 2’ బాక్సాఫీస్ కలెక్షన్‌ను ‘ఆర్ఆర్ఆర్’ బీట్ చేసింది. జపాన్ వ్యాప్తంగా 209 స్క్రీన్స్, 31 ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా.. అక్కడ అత్యంత వేగంగా 300 మిలియన్ జపనీస్ యెన్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. విడుదలైన 34 రోజుల్లో 305 మిలియన్ జపనీస్ యెన్లు రాబట్టింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.17.9 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ 34 రోజుల్లో 2,03,867 మంది ఆర్ఆర్ఆర్ సినిమాను చూశారు.
ఇప్పటి వరకు 300 మిలియన్ యెన్ల కలెక్షన్‌తో జపాన్‌లో ‘బాహుబలి 2’ రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు 305 మిలియన్ యెన్లతో రెండో స్థానాన్ని ‘ఆర్ఆర్ఆర్’ కైవలం చేసుకుంది. అంతేకాదు, అగ్రస్థానంపై కూడా కన్నేసింది. ప్రస్తుతం అగ్రస్థానంలో రజినీకాంత్ ముత్తు సినిమా ఉంది. ఈ చిత్రం ఏడాది పాటు జపాన్‌లో ప్రదర్శితమై 400 మిలియన్ యెన్లు వసూలు చేసింది. అంటే, సుమారు రూ.23.5 కోట్లు.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో ఇంత ఎక్కువ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి 2తో రాజమౌళికి ఏర్పడిన ఇమేజ్ ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రచారం చేయడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
34 రోజుల్లోనే 300 మిలియన్ యెన్లు ‘ఆర్ఆర్ఆర్’ రాబట్టింది. కాబట్టి, మరో 100 మిలియన్ యెన్లు ఈ సినిమాకు కష్టం కాదు. జపాన్‌లో సినిమాలు సుధీర్ఘ కాలంపాటు థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. ‘బాహుబలి 2’ కూడా 6 నెలలు ఆడింది. కాబట్టి, ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో అత్యధికంగా వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం గట్టిగా కలుగుతోంది.