సీనియర్ సినీ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించిందని, మధ్యాహ్నం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వయసు సంబంధిత సమస్యలకు తోడు శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయాయి. గత కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆయన వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్‌బాబు మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకులం జిల్లా ఆముదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన్ను కుటుంబ సభ్యులు సత్యంబాబుగా పిలిచే వారు. 1974లో రామరాజ్యం సినిమాతో హీరోగా శరత్ బాబు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించారు. తన 50 ఏళ్ల సినీ కెరియర్ లో 250కి పైగా చిత్రాల్లో కనిపించగా.. అందులో 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.