Rana Daggubati టాలీవుడ్ స్టార్ హీరోల్లో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను పట్టించుకోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటారు. అవి సక్సెస్ అయినా.. అట్టర్ ఫ్లాప్ అయినా.. అందరూ నడిచే దారిలో మాత్రం వీళ్లు అస్సలు నడవరు. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలని తపన పడుతుంటారు. అలాంటి వారిలో ముందుంటాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి. తన సినీ కెరీర్ నుంచి రానా డిఫరెంట్ రూట్లో నడుస్తున్నాడు. మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో నటించినా.. రొటీన్‌గా మాత్రం చిత్రాలు చేయలేదు.

అయితే గత కొంతకాలంగా మాత్రం రానాకు సరైన విజయాలు లేవు. వరుస ఫ్లాప్‌లతో ప్రస్తుతం రానా సినీ కెరీర్ కాస్త గాడి తప్పుతోంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే తన టాలెంట్‌ను పరిమితం చేయడం లేదు రానా. అలాగని కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోవడం లేదు. రానున్న యుగం అంతా డిజిటల్ స్క్రీన్ అని తెలుసుకున్న రానా ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన సత్తా చాటాడు. అలా రానా నాయుడు సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం రానా అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే తన ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి యూఎస్‌లో సందడి చేస్తున్నాడు. ఈ టూర్లో రానా సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్‌లో పాల్గొనేందుకు ప్రభాస్‌కి తోడుగా వెళ్లిన రానా .. కామిక్ కాన్ వేదికగా తన అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా తన నెక్స్ట్ ప్రాజెక్టులను ప్రకటించి షాక్ ఇచ్చాడు. హీరోగా, నిర్మాతగా తన తదుపరి ప్రాజెక్టుల విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
రానా ‘హిరణ్య కశ్యప’ అనే సినిమా చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. రానా లీడ్ రోల్లో నటించనున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించనున్నాడట. అమరచిత్ర కథలు ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు మాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ని కామిక్ రూపంలో ‘టింకిల్’ పేరుతో రానా నిర్మిస్తున్నాడట. రానాకు చెందిన స్పిరిట్ మీడియా, వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఈ హ్యాండ్సమ్ హంక్ కామిక్ కాన్ వేదికగా ప్రకటించాడు.
మరోవైపు, ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీలివ్’తో కలిసి స్పిరిట్ మీడియా సంస్థ.. ‘లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్’ అనే హిస్టారికల్ వెబ్‌సిరీస్‌ను కూడా నిర్మించనుంది. అయితే అప్పట్లో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గతంలోనే ప్రకటించారు. కానీ ఆయన ‘శాకుంతలం‘తో బిజీ కావడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆ ప్రాజెక్టును కొన్ని రోజులు పక్కకు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి, రానా ఇప్పుడు ప్రకటించిన ప్రాజెక్టు అదేనా? ఈ సినిమాను దర్శకత్వం వహించేది గుణశేఖరేనా? అన్న విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.