సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై చాలా మంది మాట్లాడారు. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అసలు సౌత్ లో పది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ విషయంపై రకుల్ నిప్పులు చెరిగింది. హీరోయిన్లతో అన్నీ చేయించుకుంటారు కానీ, డబ్బులు మాత్రం ఇవ్వరూ అని చెప్పింది.
ఒక సినిమా కోసం నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. అయినా రెమ్యునరేషన్ విషయంలో చాలా వైవిధ్యం చూపిస్తారు. నిజానికి ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురాగల సత్తా నటీమణులకూ ఉంటుంది. ఈ విషయాన్ని చిత్రపరిశ్రమలోని వారు గుర్తించాలి. సినిమాలో ప్రధానపాత్రల్లో నటించిన వారికి పారితోషికం ఒకేలా ఇవ్వాలి. మహిళలైతే ఒకలా.. పురుషులకైతే మరోలా ఇవ్వకూడదు. సినిమాలోని పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుందంటే అది ఆ పాత్రకు ఉన్న బలం.. అంతేకానీ అందులో ఎవరు నటించారన్నది కాదు’’ అని రకుల్ ప్రీత్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి రకుల్ ప్రస్తావించారు. ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. గతంలో ఆమె నటించిన సినిమాలకు అగ్రహీరోల చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని తెలిపారు. నటీనటుల్లో టాలెంట్‌ను చూడాలని రకుల్ సూచించారు. ఇక తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు.